Sunday, 6 February 2022

శ్రీ హనుమద్భాగవతము (152)



అపరిమితమగు శక్తి సంపన్నడైన ప్రభుని చరణారవిందములకు సాష్టాంగ దండప్రణామములను అర్పించి, కానుకులను ఇచ్చి వినయ పూర్వకముగా స్తుతించి ఇట్లు పలికెను. " దేవాది దేవా ! సృష్టి నిర్మాణ సమయమందు నీవే నన్ను జడునిగా సృష్టించితివి. కావున నా జడత్వముపై దృష్టి నుంచక నన్ను క్షమింపుము. నాపై కృపను చూపుము. వానరసైన్యములో శిల్పకళానిపుణులైన నలుడు, నీలు ను వానరులు కలరు. నీ కృపా విశేషముచే మహర్షుల ఆశీర్వాదబలముచే ఆ ఇర్వురు శిల్పులు స్పృశించినంత మాత్రముననే పర్వతములైనను నాపై తేలి ఆడగలవు. వీరు సుందరము సుదృఢమైన సేతువును నిర్మించుటలో సమర్థులు. నేను కూడా వారితో సహకరించెదను. ఇట్లొనరించినచో నా మర్యాద సురక్షితముగా నుండగలదు. అందఱు ఈ ప్రపంచములో సకలపాపములను హరింపగల నీ కీర్తిని గాన మొనరించెదరు”. శ్రీరామచంద్రుడు సముద్రుని ప్రార్థన విని తానెక్కు పెట్టిన దివ్యాస్త్రమును ద్రుమకుల్యమనే ప్రదేశముపై విడిచెను. రామబాణం ఆ ప్రదేశమును నాశనమొనరించి తిరిగి శ్రీ రామచంద్రుని తూణీరమును చేరెను. ప్రభువు సేతువును నిర్మింపవలసినదిగ ఆజ్ఞాపించెను. 


"జయ శ్రీరాం, జయ శ్రీసీతారాం, జయ శ్రీలక్ష్మణ అనుచు వానర సైన్యమంతయు జయజయా కారములను ఒనరించినవి. ఆ విజయఘోష ఆకాశమునంతయు ప్రతి ధ్వనింపజేసెను. శ్రీ ఆంజనేయుని ఉత్సాహమునకు అవధులు లేకపోయెను. ఆయనయే స్వయముగా పర్వతశిలలను, వృక్షములను తెచ్చి నల నీలుల ఆదేశానుసారముగా సముద్రములో వేయుచుండెను. చంచలురైన వానరులు సంయములై శ్రీ ఆంజనేయును అనుసరించిరి. శ్రీ ఆంజనేయుని ఉత్సాహమును దక్షతను, శ్రమను గాంచి సర్వవానర భల్లూక వీరులు ప్రోత్సాహితులై ఎగురుచు, దుముకుచు పర్వతశిలలను తెచ్చి సాగరములో పడవేయడం ఆరంభించారు. నలనీలులు కూడా ఎంతయో శ్రమించినవారై మొదటి దినముననే పదునాల్గు యోజనములు దూరము సేతువును నిర్మించారు.


శ్రీ ఆంజనేయునకు సంతోషము కలుగలేదు. మరుదినమున ఆయన వానర భల్లూక వీరులను మరింత ప్రోత్సహపరుచ సాగెను. దానివలన ఆ దినము ఇఱువది యోజనముల దూరము సేతువు నిర్మింపబడెను; అయినను శ్రీహనుమకు సంతృప్తి కలుగలేదు. జానకి యొక్క కరుణామయమైన రూపము శ్రీ ఆంజనేయుని హృదయమును వ్యాకులం ఒనరించుచుండెను. శీఘ్రాతిశీఘ్రముగా సీతాదేవిని శ్రీ రామచంద్రుని చరణముల చెంతకు చేర్చవలెనని, లంకాధిపతియైన రావణునకు ముక్తి ఒసంగవలెనని శ్రీ ఆంజనేయుడు వ్యగ్రుడగుచుం డెను. నలుడు, నీలుడు సేతునిర్మాణ కార్యక్రమములో విశ్రాంతినైనను తీసుకొనక పరిశ్రమించుచుండిరి. వానర భల్లూక వీరులు తోడ్పడుచుండిరి. శ్రీ ఆంజనేయుడు అంతటి శ్రమను ప్రశంసించి, వారిని ఉత్సాహపర చుచుండెను. దానివలన మూడవదినమున ఇరువదియొక్క యోజనముల దూరము నిర్మాణమయ్యెను; 


No comments:

Post a Comment