ఇట్లు గోవర్ధనగిరి ప్రభువును, భక్తుని స్మరించుచు గుణ గాన మొనరించుచుండెను. అచట భక్తవాంఛకల్పతరువైన శ్రీరామచంద్రుడు ఇట్లా ఆలోచించెను. 'ఈ గోవర్ధనగిరి గోలోకవాసి, నా మనోహరమైన మురళీధరమూర్తిని' సదా ధ్యానించు అనన్యభక్తుడు. అతడు నన్ను శ్రీకృష్ణరూపమున దర్శింపవలెనని ప్రార్థించినచో అది ఈ అవతారమున సంభవము కాదు.'
ఇట్లు శ్రీ రామచంద్రుడు ఆలోచించుచుండగానే ఐదవ దినమున నూఱు యోజనముల పొడవు, పది యోజనముల వెడల్పుగల సేతునిర్మాణములో మిగిలిన ఇరువదిమూడు యోజనముల నిర్మాణము పూర్తియయ్యెను. “సేతుబంధన కార్యము పరిపూర్ణమయ్యెను. కావున వృక్ష పర్వతాదుల అవసరము లేదు. వారి వారి చేతులలో నున్న పర్వతములను, వృక్షములను ఆయా ప్రదేశములందే విడచి శీఘ్రముగా సాగరతటమును చేరవలయు”నని శ్రీ రామాజ్ఞ అంతట వెంటనే చాటబడెను.
చంచలురైన వానరవీరులు పరుగుపరుగున దశదిశలకు పోయి శ్రీరామచంద్రుని ఆజ్ఞను తెలియజేసిరి. అందఱు వెంటనే తమ హస్తములలోనున్న శిలలను, వృక్షములను, పర్వతములను వదలినవారై ప్రభువు సమీపమునకు పరుగెత్తడం ఆరంభించారు. నేడు దక్షిణాపథములోనున్న పర్వతము అన్నియు నాడు వానర వీరులు వదలివేనని పురాణవేత్తలు పల్కెదరు. దక్షిణమున నున్న పర్వతములన్నీ సేతునిర్మాణ కార్యక్రమమునకు ఉపయోగింపబడెను.
మహామహీమామయుడైన కేసరీకిశోరుడు గోవర్ధనమును వామహస్తము పైకెత్తినవాడై ఆకాశమార్గమున పయనించుచు ప్రజభూమిని దాటుచుండెను. అప్పుడే శ్రీరామాజ్ఞను ఆలకించినవాడై ఆ మహావీరుడు గోవర్ధనగిరిని ఆ క్షణమందే ప్రజభూమిపై నుంచెను, ఈ హఠాత్పరిణామమునకు గోవర్ధనగిరి హతోత్సాహుడై ఆశాభరితములగు నేత్రములతో శ్రీ ఆంజనేయుని చూచెను.
No comments:
Post a Comment