ఇట్లా పవనాత్మజుడు ప్రచండవీరుడై రాక్షసవీరులను తన తీక్ష్ణమైన నఖములచే చీల్చి చెండాడెను. దైత్యుల రక్తముచే ఆంజనేయుని శరీరమంతయు అరుణవర్ణముగా ప్రకాశింపనారంభించెను. ఆ రక్తరంజనుని గాంచి స్వయముగా రావణుడే భయముతో కంపించెను. లక్ష్మణుడు ఒనరించిన శరవర్షముచే రావణుని శరీరమంతయు విదీర్ణమై రక్తము ప్రవహింప నారంభించెను. రాక్షసరాజు కోపించి బ్రహ్మదేవునిచే ప్రదత్తమైన అద్భుతమైన శక్త్యాయుధమును సుమిత్రానందనుని పై ప్రయోగించెను. ఆ శక్తి శ్రీరామానుజుని విశాల వక్షఃస్థలమును విదీర్ణమొనరించి అదృశ్యమయ్యెను. లక్ష్మణుడు క్షత గాత్రుడై భూమి పైబడెను.
రావణుడు ప్రసన్నుడై లక్ష్మణుని సమీపించి వాని నెత్తుటకు ప్రయత్నింపసాగెను. శివుని కైలాసపర్వతమునే పెకలించిన రావణుడు నేడు లక్ష్మణుని శరీరమును కదల్చనైనను కదల్చలేకపోయెను, ఆంజనేయుడు ఆ ప్రదేశమునకు ఏతెంచి జరిగి నది గాంచి కోపోద్దీపితమానసుడై రావణునివక్షఃస్థలము పై ముష్ఠిఘాత మొనరించెను.
ఆ ఆఘాతమునకు రావణుడు కంపించెను. పృథ్విపై మోకాళ్ళపై బడి, ముఖమునుండి నేత్రములనుండి కర్ణములనుండి రక్తము ప్రవహించెను. గిలగిలకొట్టుకొనుచు వివశుడై తన రథపృష్ఠ భాగమునకు పరుగిడి మూర్ఛితుడయ్యెను. కొట్టుకొనుచు ఆంజనేయుడు సుమిత్రానందనుని లేవనెత్తుకొని శ్రీరామచంద్రుని చెంతకు చేరెను. శత్రువులు కదల్పజాలని శేషావతారుడైన లక్ష్మణుడు పరమభక్తుడైన ఆంజనేయునకు సులభముగా తోచెను. పావనమైన శ్రీ రామచంద్రుని కరస్పర్శచే లక్ష్మణుడు మూర్ఛ నుండి లేచెను.
No comments:
Post a Comment