Thursday, 17 February 2022

శ్రీ హనుమద్భాగవతము (163)



నేరేడు పండ్లతో కొట్టిన గజరాజుపై ఎట్టిప్రభావముపడునో అట్లు ఆ మహాకాయుని కాయము అట్లుండెను, వానర భల్లూక వీరులు ఆ పర్వతాకారుని గాంచి భయమునొందిరి. అదే సమయములో ఆ ప్రదేశమునకు హనుమంతుడు వచ్చెను. అతడు కుంభకర్ణునిపైకి దుమికి వానిని పిడికిళ్ళతో కొట్టసాగెను. ఆ రుద్రావతారుని వజ్రముష్టిప్రహారములచే కుంభకర్ణుడు వ్యాకులుడై పృథ్విపైబడి నెత్తురుగ్రక్కెను. కుంభకర్ణుని మృత్యువు శ్రీరామచంద్రునిచే సంభవింపవలసియున్నది గావున, ఆంజనేయ వానిని వదలివేసెను. కుంభకర్ణుడు ఒకనాడు భీకరయుద్ధమొనరించి భగవంతుడైన శ్రీ రామచంద్రుని శరమునకు అసువులను అర్పించి ముక్తుడయ్యెను.


కుంభకర్ణుని మరణ వార్త రావణుని వివశునిగా చేసింది, అతడే స్వయముగా రణరంగమునకు వెళ్ళాడు. వాని హస్తమున అమితభయంకరము, దీప్తిమంతముమైన ధనువుండెను. ఆతడు తీక్షణశరవర్షముచే వాసర సైన్యమును నొప్పించెను. అపుడు వజ్రాంగుడు, మహాబలవంతుడైన హనుమంతుడు రావణుని సమ్ముఖమునకు వచ్చినవాడై తన దక్షిణకరమును ఎత్తి చూపుచు రావణుని భయాక్రాంతునిగా చేయుచు ఇట్లు పలికెను.


శ్లో|| ఏవ మే దక్షిణో బాహుః పంచశాఖాః సముద్యతః 

విధమిష్యతి తే దేహే భూతాత్మానాం చిరోషితమ్. 

( వా. రా. 6.59–56) 


‘రావణా! ఐదు వేళ్ళతో గూడిన నా దక్షిణ కరమును చూడుము. చిరకాలమునుండి నీ శరీరములో నివసించు జీవుని నా ఈ కరఘాతము నీ దేహమునుండి వేరుచేయును.’

పరమపరాక్రమవంతుడైన రావణుడు కోపించినవాడై ఇట్లు పల్కెను. “వానరా! నీవు నిశ్చింతగా నాపై ప్రహారం ఒనరింపుము. నీవు ఎంతటి పరాక్రమవంతుడవో చూచి నేను నీ ప్రాణములను హరించెదను”.


No comments:

Post a Comment