Friday, 18 February 2022

శ్రీ హనుమద్భాగవతము (164)



ఆంజనేయుడు ఇట్లు ప్రత్యుత్తరం ఒసంగెను. “రాక్షస రాజా! నీకు ప్రాణ సమానుడగు అక్షయకుమారుడు నాచేతిలో మరణించుట మరచితివా ?"


శ్రీ హనుమంతుడిట్లు పలుకగానే రావణుని హృదయము మండెను. అతడు వెంటనే పవనాత్మజుని వక్షఃస్థలముపై తన సర్వశక్తిని కూడదీసికొని ముష్టిఘాత మొనరించెను.


బలపరాక్రమ సంపన్నుడు, మహా తేజస్వియైన రావణుని ముష్టి ఘాతముచే శ్రీహనుమంతుడు ఒక్క క్షణము చలించెను, కాని బుద్ధిమంతుడు, తేజస్వీయైన ఆ వానర వీరుడు మరుక్షణమందే సుస్థిరుడై రాక్షసరాజుపై వజ్రముష్టి ఘాత మొనరించెను.


పరాక్రమవంతుడు, వజ్రాంగుడు, మహావీరుడైన ఆంజనేయుని వజ్రముష్టిఘాతముచే రావణుడు కంపించెను. కొన్ని క్షణముల పిమ్మట అతడు తన్ను తాను సంబాళించుకొని సాధు సాధు వానరవీరా! పరాక్రమములో నాకు నీవు ప్రశంసనీయమైన ప్రతీద్వంద్వివి.


వీరవరుడగు పవనకుమారుడిట్లు ప్రత్యుత్తరమొసంగెను. 'ఓరీ! రావణా!


శ్లో॥ దిగస్తు మము వీర్యస్య యత్ త్వం జీవిత రావణ


(వా. రా. 6–59–67)


"నీవు ఇంకను జీవించియే ఉన్నావు. కావున నా పరాక్రమమునకు ధిక్కారము. నీవు మరియొక పర్యాయము నాపై ప్రహారమొనరింపుము. తదుపరి నేను నీపై ముష్టిఘాత మొనరించెదను. నీవు యమలోకమునకు పోవుట నిశ్చయము.


మర్కటాధీశుని వాగ్బాణములచే రాక్షసరాజైన రావణుడు కోపించినవాడై ఆంజనేయుని వక్షఃస్థలముపై తీవ్రముగా గ్రుద్దెను.


రావణుడు ఒనరించిన ఆ ఆఘాతముచే హనుమంతుడు మరల క్షణకాలము విచలితుడయ్యెను. ఆ క్షణమందే రావణుడు తనరథమును ఆ ప్రదేశమునుండి తప్పించి వానర సైన్యాధిపతియైన నీలునితో తలపడెను. రావణుడు శ్రీరామచంద్రునిచే మరణించుట విధివిధానమని ఎఱింగిన మారుతి వానిని వదలివేసెను.


No comments:

Post a Comment