Saturday, 26 February 2022

శ్రీ హనుమద్భాగవతము (172)



శ్రీరామనామమును ఉచ్చరించుచు వజ్రంగబలి ప్రసన్నుడై ద్రోణగిరిని చేరేను. ఆ పర్వతముపై అనేకములైన ఓషధులు ప్రకాశించుచుండెను. వానిలో సుషేణుడు చెప్పిన ఓషధులను వేఱుచేయుటెందులకని ఆలోచించి ద్రోణగిరినే పెకలించి గరుత్మంతునితో సమమైన భయంకర వేగముతో ఆకాశమునకు ఎగిరెను.


ద్రోణాచల సహితముగా వేగముగా ఆకాశములో ఆంజనేయుడు పయనించుచుండగా పెనుగాలి వీచుచున్నట్లు ధ్వనింప ఆకాశమున పయనించుచు శ్రీ ఆంజనేయుడు అయోధ్యను దాటుచుండెను. అయోధ్యా నగరమునకు ఆవల పర్ణకుటీరములో నివసించుచున్న శ్రీరామచంద్రస్మరణ పరాయణుడుడైన భరతుడు ఆకాశములో పయనించుచున్న భజరంగ బలిని గాంచెను. అసురుడెవడైన పర్వతమును ధరించి వచ్చుచున్నాడేమో అని తలచి భరతుడు మొనలేని బాణమును ధనువునందు సంధించి విడచెను.


ఆ బాణాఘాతమునకు 'శ్రీరామ, శ్రీరామ' అనుచు హనుమంతుడు మూర్ఛితుడై భూమి పైబడెను. సంజీవనీ పర్వతము మూర్ఛావస్థలో ఖూడా కదలకఉండెను.


ఆహా ! ఇతడు శ్రీరామచంద్రుని భక్తుని వలెనున్నాడేయని భరతుడు తలంచి కంపించెను. ఆంజనేయుడు మూర్ఛిల్లి ఉన్నను ఆయన ప్రతి రోమము శ్రీరామనామమునే పల్కు చుండెను.


జటాజూటాధారి, శ్యామలవర్ణుడైన భరతుని నేత్రములు అశ్రుపూరితములయ్యెను. ఆయన ఆంజనేయుని సచేతనునిగా ఒనరించుట అనేక ప్రయత్నముల ఒనరించి విఫలుడై తుదకు ఇట్లు పల్కెను. “దుర్లంఘ్యమైన ఏ విధి నన్ను శ్రీ రామచంద్రుని నుండి వేఱుపరచెనో అదియే నేడు ఇట్టి దుఃఖభరితమైన సంఘటనను గల్గించెను. కాని భగవంతుడైన శ్రీ రామచంద్రుని పావన చరణారవిందములందు నాకు విశుద్ధము, నిశ్చలమైన ప్రేమ ఉన్నచో శ్రీరఘునాయకుడు నా పై ప్రసన్నుడుగా ఉన్నచో ఈ వానర శ్రేష్ఠుడు పీడావిముక్తుడై పూర్వమువలె సచేతనుడు, సశక్తుడును అగు గాక !


No comments:

Post a Comment