Monday 14 February 2022

శ్రీ హనుమద్భాగవతము (160)

 


ఏఏ ప్రదేశములలో వానర సైన్యముపై అసురుల ప్రభావం అధికముగా ఉండునో, ఆయా ప్రదేశములలో 'శ్రీరాం, జయ శ్రీరాం'అని గగనమండలము భేదిల్లునట్లుగా జయజయధ్వానముల ఒనరించుచు ఆంజనేయుడు రాక్షసులపై దుముకుచుండెను. ఆ మహావీరుని అఘాతమునకు రాక్షస సమూహములు నశించుచుండెను. రథ సహితముగా అసురు వీరులను, ఆకాశములోనికి వేగముగా విసరివేయుచుండెను. వారు రథసహితముగా గిరగిర తిరుగుచూ సముద్రములో పడి మరణించుచున్నారు. అసురులను బట్టి సముద్రములో విసరివేయుచుండెను. ఇట్లు త్వరితగతితో శ్రీ ఆంజనేయుడు లక్షలాది అసురవీరులను సంహరించుచుండెను. ఆయన చిన్న చిన్న వృక్షములను శిలలను స్పృశింపనైన స్పృశింపడు. గగనముకు ఎగిరి సమీపములో నున్న పర్వతములను పెకలించి విద్యుద్గతితో మరలివచ్చి అసురసమూహముల పై పడవేయుచుండెను. ఆంజనేయునిచే పర్వతశిలాఖండములు కొన్ని నేరుగా పోయి లంకలో పడుచుండెను. రణరంగములో అంతట అసురులు ‘త్రాహి, త్రాహి, అనుచు పలాయన మొనరించుచుండిరి.


కుమారుడైన ఆంజనేయుడు రణరంగములో అవిశ్రాంతముగా అసంఖ్యాకులైన రాక్షసులను భయంకరముగా సంహరించుచుండుట గాంచి మిగిలిన రాక్షసులు రావణుని నాశనము నిశ్చయమని తలపోయుచుండిరి. ఇందుగలడందులేడనునట్లు ఆంజనేయుడు రణరంగమంతయు వీరవిహార మొనరించుచుండెను. రాక్షసుల ప్రభావమును నాశమొనరించుచు 'వానర సైన్యములను ఉత్సాహపరచుచుండెను. ప్రతి వానరుడు ఆంజనేయుడు తన ప్రక్కనే ఉండి యుద్ధమొనరించుచున్నట్లుగా తలంచుచుండిరి. ప్రతి రాక్షసుడు ఆంజనేయుడు తమ ఎదుట నుండి యుద్ధమొనరించుచున్నట్లుగా భ్రమపడుచుండిరి.


దైత్య సైన్యములో ప్రఖ్యాత సైన్యాధిపతులైన ధూమ్రాక్షుడు, అవినయుడు, అకంపనుడు, అతికాయుడు, దేవాంతకుడు, త్రిశరుడు మొదలైన వారందఱు ఆంజనేయునిచే సంహరింపబడిరి. ఈ సమాచారం అందగానే రావణుని ధైర్యము సన్నగిల్లెను. వజ్రాయుధధారియైన ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు తన తండ్రియైన రావణును ఊరడించెను. మేఘనాథుడు తండ్రికి నమస్కరించి వివిధ ఆయుధములతో సంపన్నమై ఉన్న వేగవంతము, విశాలమైన రథమును అధిరోహించి రణరంగమునకు ఏగెను.


No comments:

Post a Comment