Friday 4 February 2022

శ్రీ హనుమద్భాగవతము (150)



విభిషణుడు భక్తితో పల్కిన పల్కులను ఆలకింపగానే భక్త ప్రాణధనుడైన శ్రీరాముడు ప్రభువు దిగ్గున నిలుచుండెను. ఆ జగన్నాథుడు తన చరణములను ఆశ్రయించి ప్రార్థించుచున్న విభిషణుని లేవనెత్తినవాడై విశాలభుజములను చాచి హృదయమునకు హత్తుకొని ఆలింగనం ఒనరించుకొనెను. తదనంతరము ప్రీతిపూర్వకముగా విభిషణుని తన చెంత కూర్చుండ బెట్టుకొని ‘లంకేశ్వరా!’ అని సంబోధించెను.

 

గద్గదకంఠముతో విభీషణుడు శ్రీ రామచంద్రుని స్తుతించినవాడై ఇట్లుని వేదించెను. “ప్రభూ! సురముని దుర్లభములు, తాపత్రయహరములైన నీ దివ్యచరణారవిందములను దర్శించిన మాత్రముననే నేను కృతార్థుడనైతిని. నా జీవనము సుజీవనమయ్యెను. నాకు సర్వస్వము లభించెను. రాజరాజేశ్వరా! శ్రీరామభద్రా! నాకు విషయ సుఖముల పై ఇచ్ఛ లేదు. నాకు నీ చరణసరోజములపై అహైతుక భక్తిని (ప్రతి ఫలము నాశింపని భక్తిని) ప్రసాదింపుము.”

 

కాని శ్రీరామచంద్రుడు అనుజుడైన సౌమిత్రితో "లక్ష్మణా! నన్ను దర్శించినందులకు విభీషణునకు ఫలం ఈ క్షణమందే లభింపవలయును. సాగరజలమును తెమ్ము అని పల్కెను.

 

సీతామనోవల్లభుడైన శ్రీరామునాజ్ఞను పొందగానే రామానుజుడు కలశముతో సాగరజలములను తెచ్చెను. విభీషణుని ఉన్నతాసనము పై కూర్చుండబెట్టి వానర భల్లూక వీరులు ‘జయజయ ధ్యానములను ఒనరించుచుండగా లంకానగరమునకు వానిని సామ్రాట్టుగా అభిషేకించెను. రావణుడు తన పది శిరములను సమర్పించి శంకరుని ప్రసన్నునిగా చేసికొని పొందిన సకలైశ్వర్యములను శ్రీ ఆంజనేయుని అనుగ్రహమునకు పాత్రుడైన విభీషణునకు శ్రీరామచంద్రుడు ప్రసన్నుడై అనుగ్రహించెను. 

No comments:

Post a Comment