బాణవిద్ధుడైన జాంబవంతుడు అధిక కష్టముతో ఇట్లు ప్రత్యుత్తరమొసంగెను.
శ్లో॥ అస్మిన్ జీవతి వీరో తు హతమమప్యహతం బలమ్
హనూమత్యుజ్ఞితప్రాణే జీవనోఒపి మృతా వయమ్ |
ధరతే మారుతిస్తాత మారుతప్రతి మో యది
వైశ్వానరసమో వీర్యే జీవితాళా తతో భవేత్ (వా. రా. 6.73.22, 23)
రాక్షసరాజా! వీరవరేణ్యుడైన ఆంజనేయుడు సజీవుడై ఉన్నచో వానర సైన్యము మరణించినను జీవించియున్నట్లె. ఆయన ప్రాణములు పోయినచో మేమందరము జీవించి ఉన్నను మరణించినవారమే అని తెలిసికొనుము. సమాన వేగవంతుడు, అగ్ని సమాన పరాక్రవంతుడు జీవించి ఉన్నచో మేమందఱము జీవించినట్లే యని ఆశింపవచ్చును.
అదే సమయములో ఆంజనేయుడు ఆ ప్రదేశమునకు వచ్చి వృద్ధవీరుడైన జాంబవంతుని రెండుపాదములను స్పృశించుచు వినయపూర్వకముగా నమస్కరించెను. మారుతాత్మజుని సంస్పర్శము కలుగగానే అస్త్రములచే పీడింపబడు జాంబవంతుని ముఖము ప్రకాశింపసాగెను. ఆయన ఆంజనేయునితో ఇట్లు పల్కెను.
శ్లో॥ ఆగచ్ఛ హరి శార్దూల వానరాంస్త్రాతుమర్హసి ||
నాన్యో విక్రమపర్యాప్త స్త్వమేషాం పరమః సభా !
త్వత్పరాశ్రమకాలోఽయం నాన్యం పశ్యామి కంచన |
వానరసింహమా! రక్షిం రమ్ము. వానరులనందఱిని రక్షింపుము. నీవు తప్ప అన్యులెవ్వరును పరాక్రమవంతులు కారు. నీవే వీరందరకు పరమసాహాయ్యకుడవు. నీవు పరాక్రమించుటకు ఈ సమయము తగియున్నది. మఱియొక్కరు దీనికి యోగ్యులుగా నాకు గోచరించుట లేదు.
కరాళ కాలసదృశుడు, కాటుక కొండ వంటి శరీరము కలవాడైన కుంభకర్ణుడు రావణుని ప్రేరణచే రణరంగమున ప్రవేశించెను. వానిని గాంచగనే వానర భల్లూక వీరులు మహా వృక్షములను, పర్వతములను పెకలించి ఆ మహాకాయునిపై విసరడం ఆరంభించిరి. ఒక్కొక్క పర్యాయము వారు కోట్లాది పర్వత శిలలనుకుంభకర్ణునిపై ప్రయోగించిరి; కాని అతడు కించిత్మాతమైనను చలింపలేదు.
No comments:
Post a Comment