విభీషణుని పట్టాభిషేకమును గాంచి వానర భల్లూక వీరులందఱు ప్రసన్నులైరి. శ్రీ ఆంజనేయుని ఆనందమునకు అవధులు లేకపోయెను. శ్రీ ఆంజనేయుని కృపా విశేషమువలననే విభీషణుడు శ్రీరామచంద్రుని అనుగ్రహమునకు పాత్రుడైనాడనుట నిర్వివాదాంశము. లంకాధిపతియైన రావణునిచే తిరస్కృతుడై నిరాశ్రితుడైన విభీషణుకు శ్రీఅంజనానందనుని అనుగ్రహముచే నిఖిలిసృష్టికి ప్రభువైన శ్రీరామచంద్రుని ఆశ్రయమును పొందెను. లంకాధిపతి అగుటయేగాక ప్రభువునకు ఆత్మీయుడు, స్వజనుడు నయ్యెను. దయార్ద్రహృదయుడు, కరుణావారధియైన శ్రీ ఆంజనేయుని అనుగ్రహమునకిది సజీవమైన నిదర్శనము.
సేతుబంధనము
సర్వసమర్థుడైన శ్రీరామచంద్రుడు లంకను చేరుటకు మార్గము కొఱకై మూడుదినముల పర్యంతము సముద్రుని ప్రార్ధించెను. కాని మూఢుడైన సముద్రునిపై శ్రీ రామచంద్రుని అనునయ వినయముల ప్రభావం ఓకింతైనను పడకుండుట చూచి ఆయన కోపించెను. శ్రీరామచంద్రుని విశాలనేత్రములు పంకజవర్ణములయ్యెను. అపుడాయన బ్రహ్మదండముతో సమమైన భయంకరమైన బాణమును సంధించి అభిమంత్రించి ఆకర్ణాంతము ధనువును లాగుచు "నేడు సర్వులు ఈ రఘుకులోద్భవు డైన శ్రీరాముని పరాక్రమమును చూచెదరు గాక! నేనిప్పుడే ఈ సముద్రుని శుష్కింపజేసెదను. తదనందరము కోటాను కోట్ల వానర భల్లూకవీరులు సాగరమును తరించి లంకను చేరగలరు.
అచింత్యశక్తి సంపన్నుడు, మహాబాహుడైన శ్రీరాముడు ఒనరించిన ధనుష్టంకారమునకు పృథ్వి కంపించెను. పర్వతములు వణకెను. సూర్యుడు ప్రకాశించుచుండగానే దశ దిశలందు అంధకారముతో నిండెను. అంతరిక్షములో తుములధ్వనులతో పిడుగులు పడనారంభించెను. సముద్రుడు వ్యాకులుడై భయమతో కంపించుచు జాంబూనదములను దివ్యాభరణములను ధరించి స్నిగ్ధమైన వైడూర్యమణివలె ప్రకాశించుచు హస్తములతో అనేక దివ్యమణులను, రత్నములను కానుకలుగా తీసుకుని శ్రీరామచంద్రుని సమ్ముఖమున కేతెంచెను.
No comments:
Post a Comment