శ్రీ ఆంజనేయుడూ పర్వతమును పెకలించుటకు వినియోగించినను ఆ గిరిశిఖరము కదలలేదు. శ్రీరామభక్తుడైన శ్రీ ఆంజనేయుడు ఆశ్చర్యచకితుడై ప్రభువును ధ్యానించెను. అపుడా ద్రోణగిరి సాక్షాత్తుగా భవవంతునిస్వరూపమైన గోవర్థనపర్వతమని, అది గోలోకము నుండి పృథ్వీకి వచ్చెనని, ఆ పర్వతమునందు గల శిలలన్నీ సాలగ్రామములని శ్రీ ఆంజనేయుడు గ్రహించెను. అపుడాయన మహిమామయమైన శ్రీగోవర్ధనమునకు అత్యంతాదర పూర్వకముగా నమస్కరించి చేతులు జోడించి వినయముగా ఇట్లు పల్కెను. “పర్వతరాజా! పరమపావనుడా! నేను నిన్ను భగవంతుని చరణముల చెంతకు చేర్చవలెనని ప్రయత్నించుచున్నాను. నీవెందులకు ప్రసన్నుడవగుట లేదో నాకు అవగతము కాకున్నది! దయాధాముడైన ప్రభుని దివ్య. మంగళ దర్శనము నీకు లభించుటయేగాక సుఖశాంతులకు నికేతనములైన తన దివ్యచరణారవిందములతో నిన్ను స్పృశించుచు ఆ జగన్నాథుడు సముద్రమును దాటి లంకను చేరగలడు.”
శ్రీ రామచంద్రునికి ప్రీతిపాత్రుడైన శ్రీ రుద్రావతారుని వచనములను ఆలకించగానే గోవర్ధనగిరి ఆనందమగ్నుడయ్యెను. 'ఆహా! ఆ ప్రదేశములో నాకు దుర్లభమైన భగవానుని దర్శనము లభించును. స్వామి నాపై తాపత్రయహరములైన తన చరణకమలముల నుంచి సముద్రమును దాటగలడు'. ఇట్లా ఆలోచించుకొనగనే గోవర్ధనగిరి ఆనందమునకు అంతు లేకపోయెను. అతడు శ్రీ ఆంజనేయునితో ఇట్లు పల్కెను. “పవనకుమారా ! నీ అనుగ్రహమునకు అత్యంత కృతజ్ఞుడను. ఈ మహోపకారమునకు నేను ప్రత్యుపకారం ఎన్నటికిని చేయలేను. దయామయుడా! శీఘ్రాతిశీఘ్రముగా నన్ను ఆ దేవాది దేవుని దివ్యచరణారవిందముల చెంతకు తీసుకునిపొమ్ము. నీవు నాపై చూపించుచున్న ఈ కృపావిశేషమునకు నేను సదా ఋణగ్రస్తుడనై ఉండెదను.”
ఆంజనేయుడు గోవర్ధనమును అవలీలగా నెత్తెను. కపీశ్వరుని వామహస్తముపై గోవర్ధనగిరి ఒక పుష్పమువలె పర్వతేశ్వరుని ఆనందమునకు అంతు లేకపోయెను. అతడు ఇట్లనుకొనెను. 'నేడు మహావీరుడైన హనుమంతుని కృపావిశేషముచే నా చిరకాల వాంఛితము నెఱవేఱనున్నది. మంగళమయుడు, పరోపకారమూర్తి అయిన పవనాత్మజుడీ ప్రకారముగా ఎందఱికి హీతమొనరించెనోకదా ! భాగ్యవశమున నేడీ మహిమాన్వితుని దర్శనము కల్గెను. ఈయనను స్పృశించు అదృష్టము సంప్రాప్తమయ్యెను. నేడు ఈ భక్తాగ్రేసరుని అనుగ్రహవిశేషముచే కమలనయనుడు, నా జీవన సర్వమునైన భగవంతుని దర్శనము కలుగబోవుచున్నది.'
No comments:
Post a Comment