కుతూహలముగలవాడై శ్రీరఘునందనుడు కొన్ని శిలాఖండములను సముద్రములో పడ వైచెను; కాని అన్నియు మునిగిపోయెను. అపుడాయన “నీటిపై శిలలు తేలుట ఎట్లు సంభవము! నేనే నా హస్తములతో సముద్రములో శిలలను పడవేయగా తేలుటకు బదులు అవి మునుగుచున్నవి. కారణమేమి” అని ప్రశ్నించెదను.
- వానర భల్లూక యోధులందఱు పరమాశ్చర్యచకితులై ఒకరిముఖములను ఒకరు చూచుకొనడం ఆరంభించారు.
జగన్నాథుడగు శ్రీరామచంద్రునకు అనన్యభక్తున శ్రీపవనాత్మజుడు ముకుళితహస్తుడై ఇట్లు ప్రత్యుత్తరం ఒసగెను. “జగదాధారా! నీవు నీ కరకమలముల నుండి వదలిన పదార్థములు సహజముగానే మునిగిపోవును. వృక్షము నుండి వేరయిన కొమ్మ నశించునట్లు నిన్ను వీడినవారు అధోగతి పాలయ్యెదరు. నీ ఆధారము లేని ప్రాణికి గతి ఎక్కడ". ఇది విని శ్రీ రామచంద్రుడు మందహాసము చేసెను.
వానర భల్లూక వీరులతో నిండిన మహా సైన్యమును తోడ్కొని శ్రీరామచంద్రుడు వారధిపై పయనించి లంకను చేరెను. సువేలపర్వతము చెంత శ్రీరాముని సైన్యము విడిది చేసెను. ఉన్నతము, సుందరము, సమతలమునైన శిఖరము పై వృక్షముల యొక్క కోమల పత్రములచే ఒక ఆసనమును సుమిత్రానందనుడు ఏర్పరచి దానిపై సుందర మృగ చర్మమును పఱచెను. ఆ ఆసనముపై కరుణావతారుడైన శ్రీరామ ప్రభువు వానరరాజైన సుగ్రీవుని ఒడిలో తలవంచుకొని శయనించెను. ఆయన ఎడమవైపు విశాలమైన ధనువుండెను, కుడి వైపు అక్షయతూణీరములుండెను. ప్రభువు ఒక దీప్తిమంతమైన తీక్షణతమమైన శరమును తన కరకమలములతో నిమురు చుండెను. భాగ్యవంతుడైన విభీషణుడు రామభద్రుని పరామర్శించుచుండెను. అదృష్టవంతులైన ఆంజనేయుడు, అంగదుడు ప్రభువుయొక్క చరణకమలములను మెల్లమెల్లగా నొక్కుచు ఆ దివ్య ముఖారవిందమును దర్శించుచుండిరి. వీరవరుడైన సౌమిత్రి ధనుర్భాణములను ధరించినివాడై ప్రభువు చెంత వీరాసనములో సావధానుడై కూర్చుండియుండెను.
అదే సమయమందు ఆకాశములో ఉదయించిన చంద్రుని గాంచినవాడై శ్రీరామచంద్రుడు 'మీ మీ బుద్ధ్యనుసారముగా చంద్రునిలో ఈ శ్యామవర్ణ మెట్లు ఏర్పడెనో వివరింపు' డని పలికెను.
No comments:
Post a Comment