మూర్తీభవించిన కృతజ్ఞతలో శ్రీ రఘునాథుడు ఎంత ప్రసన్నుడై ఆంజనేయుని తన వక్షఃస్థలమునకు హత్తుకొని ఇట్లు పల్కెను.
శ్లో॥ మారుతిం ప్రాహ వత్సాద్య త్వత్ప్రసాదాన్మహాక పే॥
నిరామయం ప్రపశ్యామి లక్ష్మణం భ్రాతరం మమ
(ఆధ్యాత్మ రామాయణం 6-7.30)
వత్సా! మహాకపీశ్వరా ! నేడు నీ కృపావిశేషము వలననే నేను నా సోదరుడైన లక్ష్మణుని నిరామయునిగా గాంచ గల్గుచున్నాను.
వజ్రంగబలి యైన ఆంజనేయుడు ఒనరించిన ఈ మహత్తర కార్యమును శ్రీరాముడు, పునర్జీవితమును పొందిన లక్ష్మణుడు ప్రశంసించుటయేగాక వానర భల్లూక వీరులందఱు వే నోళ్ళ పొగడనారంభించి. కాని అభిమానశూన్యుడైన ఆంజనేయుని హృదయములో ఎట్టి అహంకారము కలుగ లేదు. తానేమియు చేయనివానివలె ఆయన మిన్న కుండెను. అంతయు చేయువాడు మరియొకడు కలడని, ఆయనయే అభిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీరామచంద్రుడని, తాను కేవలము నిమిత్తమాత్రుడనని ఆంజనేయుని భావము. అతడు ఒంటరిగా, అందరినుండి దూరముగా ఉండి మనస్సులో అరుణకమలముల వలె ప్రకాశించు సుకోమలములైన ప్రభువుయొక్క చరణారవింద ధ్యానములో లీనుడయ్యెను.
ఇది శ్రీకృష్ణపరమాత్మ చరణారవిందమిళిందాయ మా మాససత్వ మహావైభవ సంపన్నుడు శ్రీ మట్టుపల్లి వేంకట మహాలక్ష్మీ జగన్నాథుల తనూభవుడు భక్తజన దాసానుదాసుడు సుజన విధేయుడైన శివ సుబ్బారాయ గుప్తచే ప్రణీతంబైన శ్రీ హనుమద్భాగవతమందు పూర్వ భాగము సమాప్తము.
శ్రీ హరిః ఓం తత్సత్
No comments:
Post a Comment