Sunday, 13 February 2022

శ్రీ హనుమద్భాగవతము (159)



అందఱు తమతమ బుద్ద్యనుసారముగా వివరించిరి. తుదకు ఆంజనేయుడు ఇట్లు పల్కెను. "పరమపావనా! చంద్రుడు నీకు ప్రియుడైన దాసుడు, నీ సుందరమైన శ్యామలమూర్తి వాని హృదయములో విరాజమానమైయున్నది. ఆ శ్యామల వర్ణమే ఆ సుధాంశునినుండి బయల్వెడలుచున్నది. 


సత్యమేమనగా పవనతనయుని రోమరోమమందు తన ప్రాణారాధ్యుడైన శ్రీరామచంద్రుడే విరాజమానుడై ఉన్నాడు. కావుననే అంతట ఆ రాముని దర్శనమును ఆంజనేయుడు సదా పొందుచుండెను. చంద్రునిలో కూడా శ్రీరామచంద్రునే దర్శించుట ఆ అనన్యరామభక్తుని సహజస్వభావము.


దో॥ కహ హనుమంత సునహు ప్రభు ససి తుంహార ప్రియదాస | 

తవ మూరతి బిధు ఉర బసతి సోఇ శ్యామతా అభాస (మానసము 6–12)


సమరాంగణములో శ్రీ ఆంజనేయుడు


శ్రీరామచంద్రుడు తన మంత్రియైన జాంబవంతునితో ఆలోచించి దశకంఠుని చెంతకు రాయబారిగా అంగదుని పంపెను. అంగదరాయబారము తిరస్కరింపబడెను. యుద్ధము ప్రారంభమయ్యెను. రాక్షసులు మహామాయావులు. వారు ఖడ్గము, శూలము, పరశువు, శక్తి, తోమరము, గద మొదలగు ఆయుధములతో ధనుర్భాణములతో వివిధశస్త్రాస్త్రములతో యుద్ధ మొనరింపసాగిరి. వారు మహావీరులు, పరాక్రమవంతులు . రణరంగచతురులు. పరాజయము సంభవించెడిస్థితి ఉత్పన్నమైనచో వారదృశ్యులయ్యెదరు. ఆకాశము నుండి ధూళిని, అస్థికలను, రక్తమును కురుపించుచుండిరి. వానర సైన్యము వ్యాకులమగుట గాంచి మాయాపతి యగు శ్రీరాముడు ఒకే ఒక శరముతో రాక్షసమాయను వినాశమొనరించెను. వానర భల్లూక యోధులు అత్యధికోత్సాహముతో యుద్ధ మొనరింపసాగిరి.


No comments:

Post a Comment