Saturday 12 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 10 వ భాగం




అద్వైతంలో శాశ్వత యోగం


ఈ యోగం కూడా నిరంతరం పరమాత్మతో కూడి యుండాలి. అంటే అంతరం లేకుండా. మధ్య విరామం లేకుండా అని. రెండు వస్తువులు ఒకటైనంత వరకూ మధ్య ఎడం ఉంటుంది. ఆ ఎడం, దూరం అవుతందనే భయం పట్టుకొంటుంది. అట్టి ఎడం లేకుండా నిరంతరమూ కలిసి యుండుట, అనగా జీవ బ్రహ్మ అభేద యోగం గురించి తైత్తిరీయ ఉపనిషత్తులోని ఆనందవల్లి చెప్పింది. ఏమాత్రం ఎడం ఉన్నా ఐక్యానికి భంగం కల్గుతుందనే భయం పుడుతుందని దానిలోని ఒక మంత్రం వివరించింది. ముముక్షువు, బ్రహ్మములో ఉండగా అతనికి అభయ ప్రతిష్ట కల్గుతుందని చెప్పింది. గీతలోనూ, ఈ జీవబ్రహ్మ అభేదం చెప్పబడింది. ఈ నివృత్తి మార్గోపదేశం, క్షత్రియుడై కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న అర్జునునకు పట్టుబడడం వెంటనే సాధ్యం కాదని అతనికి ముందుగా కర్మయోగాన్ని, దాని గొప్పతనాన్ని వివరించాడు. చివరకు మోక్ష సన్న్యాస యోగాన్ని ఉపదేశించాడు. అన్ని పనుల ఫలాలను తనకు అర్పించాలని, తాను ఫలదాత అని, అప్పుడు సమస్త పాపాలనుండి విముక్తుణ్ణి చేస్తానని 'మా శుచః = దుఃఖ' పడవద్దని అన్నాడు.


తిరిగి పుంజుకునేటట్లు చేసిన కృష్ణుడు


కృష్ణుడు - అర్జునునితో " ఈ ఉపదేశాన్ని ముందుగా సూర్యునికిచ్చాను, కొన్ని తరాల వరకూ ఈ ఉపదేశం సాగింది. నీవు నా భక్తుడవు, స్నేహితుడవు కనుక నీకు ఉపదేశిస్తున్నాను అని అర్జునుని మిషగా పెట్టుకొని లోకానికి అంతటికీ అందించాడు. "కాలం గడచిన కొలదీ ఈ యోగం క్షీణదశను పొందింది, దానిని తిరిగి ఉద్ధరించి అందిస్తున్నాను" అని చెప్పాడు.


ఇక్కడ చెప్పిన యోగము, కర్మయోగమే. ఈ యోగాన్ని పూర్వరాజులు రక్షిస్తూ ఆచరిస్తూ ఉండేవారు. అది క్షీణించగా రాజవంశానికి చెందిన అర్జునునకు ఉపదేశించాడు. జ్ఞానయోగాన్ని సన్న్యాసులకు, అనగా సాంఖ్యులకు నిష్కామ కర్మ యోగాన్ని ఏనాడో అందించానని అన్నాడు. 'లోకేస్మిన్ ద్వివిధా నిష్ణాపురాప్రోక్తా మయానఘ జ్ఞాన యోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం' అనగా ప్రవృత్తి మార్గంలోనున్న వారికి కర్మయోగాన్ని, నివృత్తి మార్గంలో ఉన్నవారికి జ్ఞాన యోగాన్ని తిరిగి అందించాడు. 


No comments:

Post a Comment