Monday 21 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 19 వ భాగం



శంకర విజయం


శంకరుల కాలంలో 72 మతాలున్నాయని, శంకర విజయం చెప్పిందని లోగడ అన్నాను. విజయం అంటే జయించుట. ఏమిటక్కడ విజయం? ఎవరిపై విజయం? ప్రజల మనస్సులపై విజయం. రాజులు చేసేది, దిగ్విజయం. మహాత్ములు ఆత్మజయాన్ని పొందారు కనుక, చెడ్డ భావాలు దరి చేరవు కనుక అందరి మనస్సులను జయించారు. శంకరులకు 'ద్విసప్తతి మతోచ్చేత్రేనమః' అని ఒక నామం. అనగా 72 మతాలను లేకుండా చేసారని అర్ధం.


72 మతాలు


వీటి పేర్లు కూడా నేడు తెలియవు. 40 లేదా 45 మతాలను గుర్తించవచ్చు. అన్నిటికీ ఆధార గ్రంథాలు లభించవు. అందు మీమాంస, న్యాయ వైశేషిక మతాలు వేద ధర్మానికి కొంత బాసటగా ఉంటాయి. 72 మతాల పేర్లు చెప్పలేనంత మాత్రంచే ఏవో కాకమ్మ కథలు, శంకర విజయాలు చెప్పాయని భావించవద్దు.


ఆనాడు, శైవ వైష్ణవ మతాలతో బాటు బ్రహ్మను పూజించే హిరణ్య గర్భ మతమూ ఉంది. అట్లాగే ఇంద్ర, కుబేర, మన్మథ, యమ మతాలూ ఉండేవి. వారినే పరమదైవములుగా కొలిచేవారుండేవారు. అట్లాగే పితృభూత, బేతాళాదులను పూజించేవారు. 20 లేక 25 మతాలకు ఒక సిద్ధాంతమూ ఉండేది. ఇక సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, పాశుపత, కాలాముఖ, భాగవత, పాంచరాత్రాలు (శాంకర భాష్యంలో ఇవి రెండూ కలపబడ్డాయి) వేదానుకూలం కాగా, వేద విరుద్ధమైన ఆచారాలతో ఉండే గాణపత్యం, కౌమారం, శైవం, వైష్ణవం, సౌర మతాలను శంకరుడు సంస్కరించి వైదిక మతాలుగా తీర్చి దిద్దారు. వేద విరుద్ధమైన జైన, బౌద్ధాలూ ఉన్నాయి. కేవల భౌతిక వాదంతో ఉండే చార్వాకమూ ఉండేది. ఇట్లా కొన్ని మతాలను గుర్తించవచ్చు గాని చాలా వాటి పేర్లు కూడా వినబడవు. గ్రంథాలు లేవు.


No comments:

Post a Comment