పూర్వావతరాలలో రాక్షసుల బాధ ఉండడం వల్ల వారిని సంహరించడం, ప్రజలు భయం లేకుండా తమ తమ ధర్మాలను అనుసరిస్తూ ఉండడం సాగిపోయేది. వారి వారి స్వభావాలనుగుణంగా కొందరు ప్రవృత్తిలో, కొందరు నివృత్తిలో మార్గంలోనూ నడుస్తూ ఉండేవారు.
మధ్య మధ్య జ్ఞానం యొక్క గొప్పదనాన్ని ప్రకటించడం కోసం దత్త, హంసావతారాలనెత్తవలసి వచ్చింది. తీవ్రమైన బాధ లేర్పడినప్పుడు తన శక్తినంతటినీ ప్రకటిస్తూ ప్రత్యేకావతారాల నెత్తవలసి వచ్చింది. అది దశావతార ప్రయోజనం.
నర, నారాయణ, కపిల, దత్త, వ్యాస మొదలైన అవతారాలను అంశావతారాలని అంటారు. 24 అవతారాలలో అంశావతరాలూ ఉన్నాయి. ఇందు జ్ఞానోపదేశం కోసం వచ్చినవి కొన్ని, దశావతారాలు, ధన్వంతరి, మోహిని మొదలగు అవతారాలు ఉన్నాయి.
ఇక రామకృష్ణావతారాలలో అసురులే మానవాకారాలు ధరించి కంస, జరాసంధ, కౌరవాదుల రూపంలో అనేక పాలకులుగా వచ్చారు. కొందరు దుష్టక్షత్రియ సంహారము, పరశురాముడు చేయవలసి వచ్చింది. అసురుల తాకిడికి తట్టుకోలేక భూదేవి బ్రహ్మనడుగుట దేవతలను వెంట బెట్టుకొని బ్రహ్మాది దేవతలు విష్ణువును సమీపించుట - అందువల్ల కృష్ణావతారం ఆవిర్భవించుట తెలిసిందే. మానవునిగా అతడవతరించి నవనీత చౌర్యం, రాసక్రీడ, గోవర్ధన గిరి నెత్తుట, విశ్వ రూప దర్శనం, పాండవులను రక్షించుట, కుచేలాదులను బ్రోచుట మొదలైనవి ఎన్నిటినో చేసాడు. అందులో ఉపదేశం చెయ్యడం ఒకటి. ఉపదేశం చెయ్యడం కోసమే అతడవతరించలేదు. అవతారం కాలం చాలాకాలం గడిచిన తరువాతనే ఉపదేశం ఇచ్చాడు. చివరగా భక్తుడైన ఉద్ధవునకుపదేశించాడు. అదే ఉద్ధవగీత.
No comments:
Post a Comment