Saturday 5 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 3 వ భాగం





జీవులు కర్మ సంగులగుటకు ప్రకృతియే కారణమని అదియే మాయయని అన్నారు. అయితే మాయ, తనంతట అది పనిచేస్తుందా? దీనిని నియమించువాడు, ఈశ్వరుడే. ప్రకృతియే మాయయని, దానిని తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈశ్వరుడని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పింది. నా మాయను దాటడానికి ఎవ్వరికీ శక్యం కాదని గీతలో 'మమ మాయా దురత్యయా' అన్నాడు. అందరూ నివృత్తి మార్గంలో ఉండగలరా? ఉంటే ఈ జగన్నాటకం ఎట్లా సాగుతుంది? సనకాదులు, నివృత్తి మార్గంలో ఉండడాన్ని గమనించి బ్రహ్మ, ప్రజాపతులను సృష్టించాడని వారివల్ల ప్రజోత్పత్తి అయిందని భాగవతంలో చదువుకొన్నాం కదా! అందరూ జ్ఞానులైతే ఇక నాటకం ఎట్లా సాగుతుంది?


అయితే నాటకంలో ఇష్టం వచ్చినట్లు నటించవచ్చా? కూడదని, వారికిచ్చిన స్వేచ్ఛ కొద్దిపాటిదని విచ్చలవిడిగా వారుపయోగించకూడదని ఈశ్వరుడు, ఋషుల ద్వారా సందేశమిచ్చాడు. తాత్కాలిక భోగాలననుభవిస్తున్నా వారి మధ్యలో ఒక నియతి, ప్రేమ, అందం, పరస్పర సహకారం ఉండాలని, ధర్మంతో అన్నీ కూడి యుండాలని నిర్దేశించాడు. వేదం ద్వారా ప్రవృత్తి మార్గాన్ని అందించాడు. అందే కర్మానుష్ఠాన పద్ధతి యుంటుంది.


జ్ఞానకాండాన్ని చివరగా ఉపనిషత్తులందించాయి. సంసారం నుండి విముక్తమైతే మోక్షం. పుణ్యకర్మల నిచ్చేది స్వర్గం.


కర్మమార్గం ఇచ్చే రెండు ఫలాలు


నిరంతరం కార్యమగ్నులమై ఉంటాం. తాత్కాలిక సుఖం లభిస్తూ ఉంటుంది. అయినా తృప్తి యుండదు. ఏమిటి ఇదంతా అనే తాత్కాలిక వైరాగ్యం కల్గుతూ ఉంటుంది. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యాన్ని రుచి చూస్తాం తాత్కాలికంగా. నీటిమీద వ్రాత మాదిరిగా అవి కలకాలం మనల్ని పట్టుకొని యుండవు. మరల కర్మలలో మునుగుతూ ఉంటాం. ధ్యానాదులను చేయలేం. కర్మకాండలు చేస్తూ నివృత్తి మార్గంలో పయనించడానికి అందులో రెండు మార్గాలున్నాయి.

No comments:

Post a Comment