Sunday 13 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 11 వ భాగం



ఇది కూడా అవతార ప్రయోజనమే. ఈ రెండు యోగాలలో అన్ని యోగాలూ కలుస్తాయి. అయినా ఉపదేశము సాంఖ్యయోగంతో ఆరంభపడి మోక్ష సన్యాస యోగంతో ముగుస్తుంది. కనుక ఉపదేశ లక్ష్యము, నివృత్తి మార్గమే. కొన్ని సందర్భాలలో కర్మయోగాన్ని ప్రశంసించడం వల్ల ఇతడు కర్మయోగాన్నే చెప్పాడని భ్రాంతి పడుతూ ఉంటారు. దీనికి కారణం, అర్జునుడు కర్మయోగానికే ప్రస్తుతం అర్హుడు కనుక, కర్మయోగ ప్రస్తావన చేయవలసి వచ్చింది.


జ్ఞానం ద్వారా, అనగా నివృత్తి మార్గం ద్వారా మోక్షమని చెప్పడమే కృష్ణుని లక్ష్యమని శంకరులు, గీతాభాష్య ఉపోద్ఘాతంలో వివరించారు.


కృష్ణావతారం ముందు అన్ని యోగాలూ క్షీణదశకు చేరాయి. ఇంద్రియాలను అదుపులో పెట్టామని చెబుతూ ఇంద్రియ సుఖాలకై అఱ్ఱులు చాచేవారిని మిధ్యాదారులని గీతలో (3-6) అన్నాడు. కనుక ఆనాడూ నివృత్తి మార్గంలో ఉన్నవారు సరిగా ప్రవర్తించలేదని అర్థం వస్తోంది. ఇక రెండవ అధ్యాయంలో వేదాల సారాంశాన్ని గ్రహించకుండా ప్రవర్తించే మీమాంసకులను (2-42; 43) వేదవాదరతా:- వేదాలను అనుసరిస్తున్నామని అనుకొనేవారిని గురించి చెప్పాడు. వీరు జ్ఞాన విచారం చేయడం లేదని, కేవలం కోరికలను కోరేవారని, కామాత్ములని, స్వర్గపరులని ఈసడించాడు. జనులను కర్మలలో ముంచి జనన మరణ ప్రవాహంలో కొట్టుకొనిపోయేటట్టు చేసి అందమైన మాటలను పుష్పితం వాదం (Fలౌఎర్య్ ళంగూగె) పలికేవారని, వీరూ 'అవిపశ్చితః'- సరియైన విద్వాంసులు కారని నిందించాడు కదా. అనగా కృష్ణుని కాలంలో కర్మయోగం దిగజారిపోయినట్లే.


భక్తి యోగం, వెఱ్ఱి తలలు వేసిందని, తమోగుణ భక్తివల్ల అనర్ధమని అతడు చెప్పినట్లు లోగడ చెప్పాను. కనుక అన్ని మార్గాలనూ ఉద్దరించడమే కృష్ణుని అవతార ప్రయోజనం.

No comments:

Post a Comment