Thursday, 10 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 8 వ భాగం



సాధారణ ప్రజలు యోగ, వేదాంత, మీమాంసలపై దృష్టి పెట్టక కొద్దిపాటి భక్తితో ఉంటారు. ఏదో ఒక శక్తి మనలను నడిపిస్తోందని దానిని వేడితే ధనాదుల వంటివి లభిస్తాయనే నమ్ముతారు. భౌతిక ప్రయోజనాలకై ప్రయత్నం చేస్తూ, ఈశ్వరానుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు. ఉన్నది ఒక్కడైనా పెక్కుమంది దేవతలు వివిధ ఫలాలను ఇస్తారని నమ్ముతారు.


ఇది భక్తి కాదు, ఇది వట్టి వ్యాపార ధోరణియని కొందరు గేలిచేసినా వీరు భక్తి కలిగియుంటారు. అయితే ఇందులోనూ కొందరు అక్రమ మార్గాలను త్రొక్కారు. కర్మయోగం, మీమాంసకుల చేతిలో పడి ఎట్లా రూపు మాసిందో, భక్తియోగం కూడా దిగువస్థాయికి చేరుకుంది. దీనిని గీతలో 'అనేకమైన కోర్కెలకై అనేక దేవతలను కొలుస్తున్నారని' జ్ఞాన విజ్ఞాన యోగంలో గీతాచార్యుడన్నాడు. సత్త్వగుణంతో ఉన్నవారు దేవతలను, రజోగుణంతో ఉన్నవారు యక్ష రాక్షసులను, తమోగుణంతో ఉన్నవారు భూత ప్రేతాలను కొలుస్తారని శ్రద్ధాత్రయ విభాగయోగంలో సెలవిచ్చాడు. రాను రాను భక్తిమార్గంలో క్రూరకర్మలు, నరబలులూ కూడా ప్రవేశించాయి.


ప్రవృత్తి, నివృత్తి మార్గాలు పరస్పర విరుద్ధాలైనపుడు మూడవది ఎందుకుంటుందని అడగవచ్చు. భక్తి యుండడం సాధారణం కనుక కర్మ జ్ఞానాలనే పేర్కొన్నాడు. ఇదంతా మాయగా చూచే జ్ఞాని కూడా భక్తిలోనే మునిగి, మాయను గుప్పిట్లో ధరించిన భగవానుని ఈ లీలేమిటని ఆశ్చర్యపడతాడు. కొందరు భక్తులు జ్ఞానమార్గాన్ని, కర్మమార్గాన్ని విడిచి భగవానుని వాత్సల్యాది గుణాలను కీర్తిస్తూ ఉంటారు. కొందరు ప్రవృత్తిలోనే ఉండి మాకు జ్ఞానాన్ని, నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తూ ఉంటారు. కర్మయోగులు, జ్ఞాన యోగులగుటకు చిత్తశుద్ధితో పాటు ఏకాగ్రత కూడా కావాలి. ఈశ్వర స్మరణ వల్ల వారికి ఏకాగ్రత లభిస్తుంది. వీరూ భక్తి మార్గంలో ప్రవేశిస్తారు. అతడు ఫలదాతయని భక్తితో ఉంటారు. ఇక చాలామంది కర్మయోగులు కాకుండా పనులు చేస్తూ, కేవలం ఫలాలనే ఆశిస్తూ కొబ్బరికాయలను కొట్టడం, అంగ ప్రదక్షిణలు మొదలైనవి చేస్తూ ఉంటారు. నాకు ఫలానాది ప్రసాదించుమని అడగడమే భక్తియని భావిస్తారు. కొన్ని కూడని పనులను చేస్తున్నా తాము భక్తులమని అతడనుగ్రహిస్తాడని భ్రాంతి పడుతూ ఉంటారు. భక్తిని అభ్యసించుటకు వేదాలలోని ఉపాసనా కాండ కావాలంటారు కొందరు. గీతలో కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు వరుసగా చెప్పబడ్డాయి.


No comments:

Post a Comment