పెక్కుమందికి పెక్కు మార్గాలు
ఈశ్వరుడాడించే జగన్నాటకంలో మీరందరూ అరణ్యాలకు పొండి సన్యాసాన్ని స్వీకరించండి, అత్మ విచారణ చేయండంటే నూటికి 99 మంది వినరు కూడా. అట్టి తీవ్రేచ్ఛ ఉండడాన్ని ముముక్షత్వమంటారు. ముముక్షువులే ఈ జ్ఞానమార్గాన్ని అనుసరిస్తారు. ఏ నూటికో, కోటికో ఒక్కనికే పట్టుబడుతుంది. అందరూ ఏదో ఒక పనిలో మునిగి తేలుతూ ఉంటారు. ఇతరుల సాహాయ్యం, సాధనాల సాహాయ్యం అపేక్షించకుండా ఉండలేరు. వారినే గీతలో కర్మసంగులని అన్నారు. ఎందుకట్లా ఉన్నారంటే వారిలో కోరిక, కర్మ ఉండడం వల్లనే. ఆ కోరిక నెరవేరాలంటే ఊరకే కూర్చుంటే నెరవేరుతుందా? ఆత్మ సాక్షాత్కారానికే ఏ పని చేయకుండా స్తిమితంగా ఉండగలగాలి. మిగిలిన వాటిని సాధించడానికి కార్యమగ్నులు కావలసిందే.
అంటే పనులు చేస్తున్నామంటే లోనున్న ఆత్మను మరిచి దానికి దూరంగా ఉండి బాహ్యమైన వాటిల్లో తగుల్కొంటున్నామన్నమాట. దానిని ప్రవృత్తి యనే పదమే వెల్లడించింది.
ఆత్మవైపు మళ్ళడం, నివృత్తి పదం సూచిస్తుంది. అనగా ప్రవృత్తిలో కార్యమగ్నత, నివృత్తిలో కార్య విముఖత. కనుక కోరికలతో నున్నవారిని ఆత్మవిచారణ చేయండని నిర్బంధించలేం.
కార్యమగ్యులైన వారిని చెడ్డ కోరికలు కోరకుండా ఉండడానికి, మోసాలు చేయకుండా ఉండడానికి, వేదాలు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి కొన్ని విధులు నేర్పాటు చేసాయి. ధార్మిక మార్గాలను సూచించాయి. ఋషుల మాటల ద్వారా ప్రవృత్తి మార్గాన్ని సక్రమంగా ఉండేటట్లు భగవానుడే చేసాడు.
యతః ప్రవృత్తం భూతానాం యేన సర్వమిదం తతం
అని గీత చెప్పింది. అనగా ఈశ్వరుని నుండే జీవులకు ప్రవృత్తి మార్గం వచ్చిందని చెప్పింది. ఈశ్వరుడే జీవులలో ఉండి వారిని ప్రవృత్తి మార్గంలో పెడుతున్నాడని శంకరులు భాష్యంలో వివరించారు.
No comments:
Post a Comment