కొందరు ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలకై వెంపర్లాడుతూ ఉంటారు. అయితే సక్రమ మార్గంలో అనుభవించండని, మీకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఉండండని, శాస్త్రప్రకారమే కర్మకాండలు చేయండని చెప్పడం ఒకటి. ఇందులో పెక్కు నియమాలుంటాయి.
ఇక మరొక మార్గం ఉంది. కొందరు, మాకీ కర్మలూ వద్దు, ఇహ పర సుఖాలూ వద్దు, అయినా నివృత్తి మార్గం పట్టుబడలేదని వాపోతూ ఉంటారు. అట్టివారికి కర్మఫలాలను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేయండని చెప్పాడు భగవానుడు. దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని, ఇవి భగవదాజ్ఞగా చేస్తున్నామని అంటే ఆవి ఇతణ్ణి బంధించవని అన్నాడు. పరమేశ్వర ప్రీత్యర్థం అనే భావనతో చేయాలన్నాడు. అపుడు చిత్తశుద్ధి ఏర్పడిన తరువాత కర్మలను విడిచి పెట్టే స్థితి ఏర్పడుతుంది. క్రమక్రమంగా నివృత్తి మార్గంలోకి పయనిస్తాడు. అనగా అతనిలో ధ్యానం, విచారణ మొదలౌతుంది.
ఇట్లా కర్మమార్గం వల్ల రెండు ఫలాలు లభిస్తాయి. ఒకటి ఇహ పరలోక సౌఖ్యం. రెండవ మార్గంలో చిత్తశుద్ధి. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయడం చిత్తశుద్ధితో అంతం కాదు. అది జ్ఞాన మార్గంలో పయనించడానికి అర్హతను సంపాదించి పెడుతుంది.
ఫలాలను ఆశించేవాడు కూడా వేదమార్గంలో నడిస్తే ఒక క్రమశిక్షణ అతనిలో ఏర్పడి, తనకూ, సంఘానికి మేలు కలుగజేస్తుంది.
ఇంట్లోకి వాడుకోవడానికి కూరలు తోటలో పండిస్తాం. పండిన వాటిని అనుభవిస్తాం. ఒకనికి వాడుకోవడానికి కూరలు అవసరం లేకపోయినా ఏదో వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడినపుడు, ఆ బాధను మరిచి పోవడానికి కూరలను పెంచాడనుకోండి. వ్యాపార నష్టం పోతుందా? అది ఉండనే ఉంది. అట్లాగే కర్మ ఫలాలనాశించకుండా కర్మలు చేయడం వల్ల వచ్చిన లాభమేమిటి? చిత్తానికి శుద్ధి ఏర్పడడం, కర్మఫలం కాదు. కర్మఫలాలను ఆశించకుండా కర్మానుష్ఠానం చేస్తున్నాడని, నా ఆజ్ఞను పాటిస్తున్నాడని, నడవడికకు భంగం తీసుకొని రావడం లేదని, ఇతనికి చిత్త మాలిన్యం పోగొట్టాలని భగవానుడు భావిస్తాడు. అంటే భగవదనుగ్రహం కావాలన్నమాట.
No comments:
Post a Comment