Saturday, 19 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 17 వ భాగం



ఒక ముళ్ళ చెట్టు పెరిగిందంటే దానికి తగిన విత్తనం, తగిన నేల ఉన్నపుడే వృద్ధి పొందుతుంది. మానవుల మనస్సులు, పైవారి సిద్ధాంతాలను బలపరచినపుడు మాత్రమే అవి వృద్ధి పొందుతాయి. వేద ధర్మంపట్ల విముఖులైనపుడవి వృద్ధి పొందుతాయి. ఏ కర్మకాండల అవసరం లేకుండా నిర్వాణమో, లేక మోక్షమో వస్తుందంటే ప్రజలెగబడుతారు. కనుక కలిలో రాక్షసులుండరని, వారు మానవుల మనస్సులలో దూరి విజృంభిస్తారని లోగడ, అందుకే చెప్పాను. ఇతర మతాల వారు ధర్మం గురించే చెబుతున్నారని ప్రజలు భ్రాంతి పడతారు. ఇట్లా కలిపురుషుడు వీళ్ళచేత నాటకాలిస్తాడు.


కలియుగం ప్రారంభమై 2500 సంవత్సరాలు గడిచేవరకూ కృష్ణుడు, వ్యాసుడు మొదలైనవారు బోధించిన వైదిక ధర్మంవల్ల వైదిక మతం క్షీణ దశను చేరుకోలేదు. ప్రజలు నిర్లక్ష్యం చేయడం వల్ల సోడా కొట్టినపుడు ఒకమాటు బుస్సుమని గాలి తన్నుకు వచ్చినట్లు కలి విజృంభించాడు. దీనివల్ల సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే 72 మతాలు అప్పుడు ప్రచారంలో ఉండేవని కొన్ని గ్రంథాలవల్ల తెలుస్తోంది.


అధర్మానికై కలి విధింపబడ్డాడా?


చతుర్యుగాలలో కలిలో ధర్మం క్షీణిస్తుందని అనడం భగవత్ సంకల్పం కదా! కనుక కలిని ద్వేషింపనేల? అధర్మం ఉంటుందని అంటే దానిని తగ్గించే బాధ్యత మనకు లేదా? దానిని ఎగసన త్రోద్దామా?


నాటకంలో వివిధ రసాలుంటాయి. క్రోధాన్ని, భయాన్ని, క్రౌర్యాన్ని చూపించవలసి వస్తుంది. అవి హద్దు మీరకుండా దయతో ప్రజలను భగవానుడు రక్షిస్తూ ఉంటాడు. పైవి ఎక్కువ స్థాయిలో ఉంటే అది రసస్థాయికి తీసుకొని రాలేదు. విరసమే మిగులుతోంది. ఒకమూల అధర్మం ప్రబలుతూ ఉన్నా ప్రవచనాలు, భజనలు, కుంభాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కలికాలం అంతమయ్యే సమయంలో కూడా ఏ కొద్దిమందో ధార్మికులుంటారు. విత్తనాలు నశించవు, కల్కి, ఎక్కడ పుడతాడో కూడా పురాణాలు వివరించాయి. తామ్రపర్ణి నదీ తీరంలో ఉన్న విష్ణుయశస్ అనే బ్రాహ్మణుడికి కుమారుడిగా అతడు జన్మిస్తాడని అన్నాయి.


No comments:

Post a Comment