Friday 18 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 16 వ భాగం



బుద్ధిమంతులైన కొందరు, వేద ధర్మంలో కొంత గ్రహించి అదే పరమార్ధమని కొన్నిటిని ఖండించడం మొదలు పెట్టారు. వేద విరుద్ధమైన వాటిని, వేద సమ్మతములని ప్రజలచే విశ్వసింపజేసి ప్రచారం చేసారు.


ఇంద్రియ నిగ్రహం కలిగి, సదాచారం, ప్రేమా హింసలను పూర్తిగా పాటించిన బుద్ధుడు, జినుడు వంటివారు, ఈ శరీరం పోయినా ఫరవాలేదు, ఉన్నత లక్ష్యం చేరుకోవడమే మా ప్రయత్నము అని చెప్పి వేదాలు, వేద మతానుష్ఠానం అవసరం లేదని చాటారు. అయితే మన ప్రమాణ గ్రంథాలలో ఏముంది? బృహదారణ్యకోపనిషత్తులో (4-3-22) జ్ఞానికి తండ్రి లేదు, తల్లి లేదు, ప్రపంచం లేదు, దేవతలు లేరు, వేదం లేదని చెప్పబడింది. ఆ స్థితి పట్టుబడాలంటే ఎట్లా ఉండాలో వివరించింది. 'తత్త్వమసి' మహావాక్యాన్ని అందించిన ఛాందోగ్యోపనిషత్తు కూడా ఇట్లా చెప్పింది.


వేదాధ్యయనం, శాస్త్ర ప్రకారం అనుష్టానం, ఇంద్రియ నిగ్రహం, వేదం విధించిన హింస తప్ప అన్నివిధాల అహింసాపాలనం, ఉన్నవానికే అట్టి ఉన్నత స్థితి కల్గుతుందని చెప్పింది. అందువల్ల జ్ఞానులు కాని వారు, వేద విధులను పాటించవలసిందే. అందరూ బుద్ధుడూ, జినుడు కాలేరు. క్రింద మెట్టునుండి పై మెట్టునకు అడుగు వేయాలని మన మతం అంటోంది. జ్ఞాని తన నడవడిక ద్వారా దిగువ స్థాయిలో నున్నవానికి చేయూత నందీయాలని చెప్పింది. ఈ విషయమై గీత "శ్రేష్ఠుడాచరించినదే ఇతరులూ ఆచరిస్తారని” నొక్కి చెప్పింది. కనుక మహోత్తమ జ్ఞానులకుండవలసిన ధర్మాలు సామాన్యునకుండవు. ఇట్టి సందర్భంలో ఇతరమత ఖండన తప్పదు. అంటే కేవలం ఖండించడం కాదు, మన మతాన్ని సరిగా అర్థం చేసుకొనేటట్లు మనం చేయాలి. ఒప్పించగలగాలి. అందుకే శంకరులవతరించారు.


No comments:

Post a Comment