కర్మ, జడం కనుక అది ఫలాన్నియ్యదు. ఈశ్వరుడే ఫలదాత. చేసిన కర్మలకు ఫలం ఉంటుంది. పవిత్రమైన మనస్సును ప్రసాదించుట పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే. కర్మయొక్క ఫలం, చిత్త శుద్ధి అని భావించవద్దు. కర్మఫలాన్ని విడిచిపెట్టుటను, ఈ అర్థంలో భావించాలి. కర్మఫలాల త్యాగం వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
జ్ఞాన మార్గంలో అడుగు పెట్టలేని వారు కర్మలను విదలలేరు. కనుక కర్మలను చేస్తూ ఉండి, ఫలాలను ఆశించకండని చెప్పాడు. కర్మలను చేయుట, ఫలత్యాగం నా కోసమే అని చేయండి. దానివల్ల మీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అపుడు జ్ఞాన మార్గంలోకి పయనిస్తారు. ఇప్పుడు కర్మమార్గం, కర్మయోగ మవుతుంది. జ్ఞాన మార్గమెప్పుడూ జ్ఞాన యోగమే అని అన్నాడు గీతలో.
యోగమనగా కలుపుట. జీవుణ్ణి పరమసత్యంతో కలుపుట. అనేక యోగాలు చిన్న చిన్న సందుల వంటివి. ఇవి ప్రధానమైన రహదారితో కలిసి ఉంటాయి. ఇట్లా కలపడమూ యోగమే. జ్ఞాన యోగం ఒక్కటే గమ్యాన్ని చేర్చేది. కర్మయోగం పెద్ద రహదారికి తీసుకొని వెళ్ళే సందు వంటిది. కర్మయోగంలో ఉన్నవారనేక జన్మలనెత్తి, ముఖ్యమైన రహదారికి ఏనాటికో చేరుతారు.
కాలగమనంలో కర్మయోగం యొక్క క్షీణదశ
అనాదినుండి కొందరు ప్రవృత్తి మార్గాన్ని, కొందరు నివృత్తి మార్గాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ప్రవృత్తి మార్గమైనా ఈశ్వరునే లక్ష్యంగా చెప్పింది కనుక ఒక హద్దును అతిక్రమించలేదు. కర్మమార్గము, కర్మయోగమై చిత్తశుద్ధిని పొంది నివృత్తి మార్గాన్ని అవలంబించి మోక్షాన్ని పొందుతూ ఉండేవారు.
No comments:
Post a Comment