మన మతాన్ని ఖండించేవారిని ఎదుర్కొనడమే లక్ష్యం
అన్ని మతాలలోనూ మహాత్ములున్నారు. అందరూ భూతదయాది గుణాలను ప్రశంసించినవారే. బౌద్ధ, జైన, సాంఖ్యాది మతాలలో ఎందరో విజ్ఞాన వంతులు ప్రభవించిన మాట వాస్తవం. నాకూ బౌద్ధ నాగార్జునుని రచనలంటే ఇష్టమే.
భౌతిక దశను దాటి అభౌతిక దశను అందరూ కీర్తించినవారే కాని మన మతం జీవ బ్రహ్మైక్య వాదాన్ని చెప్పింది. భిన్న మతాలకు ప్రత్యేక లక్షణాలుండి అవి మన సంప్రదాయాన్ని తెలిసికోకుండా ఖండిస్తూ ఉన్నా వాటిని సహిస్తూ ఉండడమా? మన సంప్రదాయాన్ని వివరించవద్దా? జీవ బ్రహ్మలకు భేదం లేదని ఒక మూల చెబుతూ వర్ణ విభజన అంటూ గోడలు కట్టారేమిటని ఇతరులు ప్రశ్నిస్తే ఎందుకిట్లా ఉందో వివరించవలసిన అవసరం లేదా?
అన్ని పద్ధతులలోనూ మంచి యుంటుందని, మనం వైదిక మతస్థులతో కలిసి మెలిసి యుందామని బౌద్ధ, జైనులు భావించలేదు సరికదా, ఖండించారు. అపుడు మనం సమాధానం చెప్పవద్దా? అనేక దేశాలలో అనాదిగా వస్తున్న బలమైన మతం లేకపోవడం వల్ల బౌద్ధం, క్రైస్తవం, మహమ్మదీయ మతం ఆయా ప్రజలకు సంతృప్తినిచ్చాయి. కానీయండి, మనలను విమర్శిస్తూ ఉన్నపుడు మానవులలో, అధికారి భేదాలుంటాయని వాటికి అనుగుణంగా ఆచార వ్యవహారాలుంటాయని, క్రమ క్రమంగా అందరూ ఉన్నతిని పొందే మార్గాలున్నాయని వివరించవద్దా?
సరియైన కారణాలను చెప్పి వారూ మనలను ఖండించవచ్చు. మనమూ వారిని ఖండించవచ్చు. విమర్శించడానికి అందరికీ హక్కు ఉంది. విమర్శ అనేది రెండు రకాలుగా తప్పు. సరియైన కారణాలు చూపించకుండా వితండవాదం చేయడం ఒకటి. ఇక రెండవది మనస్సులో శత్రుత్వం పెట్టుకొని వాదించడం. భిన్న అభిప్రాయాలున్నంత మాత్రంచే ద్వేషించనవసరం లేదు. ప్రేమతోనే విమర్శించవచ్చు. వ్యక్తులనుద్దేశించి కాక అభిప్రాయ భేదాలపై దృష్టిని పెట్టి విశదీకరించవచ్చు.
No comments:
Post a Comment