శ్రీరామచంద్రుని సంక్షిప్త సమాచారమును అందఱు ఆలకించిరి. లక్ష్మణుని కొఱకై దీనాతిదీనముగా దుఃఖించుచున్న కరుణాభరితమైన శ్రీ రాముని దశ చూడగనే అందఱి నేత్ర ములు అశ్రుభరితములయ్యెను. రాత్రి గడచి పోవుచుండెను. ఆ విషయమును గ్రహించిన భరతుడు ఇట్లు పల్కెను. "వీర హనుమానుడా! నీవు నా బాణముపై కూర్చుండుము. నా బాణము నిన్నీ క్షణమందే ప్రభుని చెంతకు చేర్చగలదు. క్షణమైనను ఇక ఆలస్యము కారాదని పల్కెను. "ఏమి ! ఈ బాణము పర్వత సహితముగా నున్న నా భారమును భరింపగలదా " అని ఆంజనేయుడు తనలో శంకించెను. ఈ మహానుభావుడు వదలిన మొనలేని బాణముచే నేను మూర్ఛిల్లితిని. శ్రీరామచంద్రుని కృపనలన అంతయు సంభవమే అని ఆలోచించి ఆంజనేయుడు అంజలి ఘటించినవాడై భరతునితో 'రామానుజా ! ప్రభువు యొక్క ప్రతాపముతో నీ ఆశీర్వచనముతో ఈ క్షణమే నేను రణరంగమును చేరగల'నని పలికెను. తదనంతరము భరతుని చరణారవిందములకు ప్రణమిల్లి వాయునందనుడు వాయు వేగముతో ఆకాశమునకు ఎగిరెను.
రణరంగములో రాత్రి అధికముగా గడచుట శ్రీరాముడు అధైర్యమును పొందినవాడై దుఃఖించుచు ఇట్లు పలుకనారంభించెను. నా ప్రియసోదరుడు లక్ష్మణుడు నా కొఱకై తల్లిని, తండ్రిని, భార్యను మాత్రమేగాక సకలరాజ భోగములను, సుఖములను త్యాగం ఒనరించెను. నన్ను సేవించుటకు, సుఖంపజేయుటకు అరణ్యములందు శ్రమించెను. అట్టి త్యాగమూర్తియైన లక్ష్మణుడు లేకుండగా అయోధ్య మరలిపోగలను? వైదేహి లభించినను లక్ష్మణుడు లేనిదే నేనెట్లు జీవింపగలను? ప్రాణప్రియుడైన నా సోదరుడు లేనిచో నిశ్చయముగా నేను ప్రాణములను త్యజించెదను. తదనంతరము నా మువ్వురు తల్లులు, భరతుడు, శత్రుఘ్నుడు, సీత జీవింపరు. ఈ విధముగా అయోధ్య సర్వనాశము కాగలదు. నేను లేని కారణమున సుగ్రీవుడు, అంగదుడు మొదలగు వానర వీరులందఱు పోరును విరమించి కిష్కింధకు వెడలగలరు. కాని విభీషణునకు నేను ఒసంగినవచనం ఏమి కాగలదు? విభీషణుడు నన్నాశ్రయించెను. నాకు శరణాగతుడయ్యెను. పరమభక్తుడైన విభీషణునకు నేనొసంగినమాట చెల్లింపలేక పోయెదనేమో అని నా హృదయము భీతిల్లుచున్నది.
లీలామానుష విగ్రహుడు, భగవంతుడైన శ్రీ రాఘవేంద్రుని నయనముల నుండి అశ్రువులు ప్రవహింప నారంభించెను. కరుణాభరితమైన ఆయన విలాపమును గాంచి వానర భల్లూక వీరులు అధైర్యము చెంది విలపింప ఆరంభించిరి. వారు దుఃఖించుచు మాటి మాటికి ఆకాశము వంక చూచుచుండిరి. ఆంజనేయస్వామి వచ్చునేమో అని వారి ఆశ. సూర్యోదయసమయం ఆసన్నమగు చుండెను. అందఱు నిరాశాహృదయులైరి. సూర్యునివలె ప్రకాశించుచున్న వానర వీరుడు ఓషధిపర్వతమును హస్తమునందు ధరించి 'జయ శ్రీ రామ' జయ జయారావములను పలుకుచు ఆంజనేయుడు ఆకాశమార్గమున ఆ ప్రదేశమును చేరెను. పర్వతమును ప్రక్క నుంచి మారుతి శ్రీ రామచంద్రుని చరణముల పై పడెను. వానరవీరుల ఆనందమునకు మేర లేదు. వారందఱు ఆంజనేనుయుఇని వివిధ రీతులలో కీర్తింప ఆరభిన్చిరి. ఇంతలో సుషే ణుడు పర్వతమునుండి సంజీవని తెచ్చి లక్ష్మణునకు వాసన చూపించెను. నిద్రనుండి మేల్కాంచుచున్నట్లు లక్ష్మణుడు లేచినవాడై ఇట్లు పల్కెను. “మేఘనాథుడెక్కడ? వానికి మరణం ఆసన్నమైనది.
No comments:
Post a Comment