కలియుగం
కృష్ణావతారం ముగుస్తుందనగా కలి ప్రవేశించాడు. అంశావతారమైన వ్యాసుడు ప్రజలకు ప్రవృత్తి నివృత్తి మార్గాలలో పెట్టుటకు ఆవిర్భవించాడు. వేద విభజన చేసాడు. ఉపనిషత్ సందేశాన్ని బ్రహ్మ సూత్రాల రూపంలో అందించాడు. 18 పురాణాలనూ అందించి భక్తి మార్గాన్ని ప్రతిష్ఠించాడు.
బౌద్ధమతం జైన మతం హిందూ మతం -
అభ్యుదయ భావాలనందించాయని బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని, నేటి గాంధీ సిద్ధాంతాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. పై రెండు మతాల చరిత్రతోనే చరిత్ర పుస్తకాలు మొదలౌతాయి. హిందూమతంలోని యజ్ఞంలో హింస యుందని, వర్ణ విభజన యుంది కనుక పైవాటిని పొగుడుతూ ఉంటారు. వివిధ మనః ప్రవృత్తులు కలవారికి వివిధ ప్రవృత్తులని, సంఘం సక్రమంగా సాగాలంటే అందరూ అహింసను పాటించడం కుదరదని గుర్తించారని, నాల్గు ఆశ్రమాలను ఏర్పాటు చేసి మానవోన్నతికి దారి చూపించారు హిందువులని పొగడరు.
అందరికీ అహింసను చెప్పిన బౌద్ధమతం యొక్క నేటి పరిస్థితిని ఇతర దేశాలలో చూడండి. బౌద్ధ భిక్షువులే మాంసాహారులై యున్నారు కదా! ప్రభుత్వ పరంగా యుద్ధాలు వారు చేయవలసి వచ్చింది. ఒక్క అశోకుడు తప్ప ఏ బౌద్ధ, జైన రాజులూ యుద్ధాలు వద్దని బోధించలేదు. ఇవి తప్పని సరియని గుర్తించడం వల్లనే వారూ యుద్ధాలు చేయవలసి వచ్చింది. మన మతంలో కొందరికే యుద్ధ విద్య తప్ప మిగిలినవారికి లేదు. సన్న్యాసులకే అహింసానియమం తప్ప మిగిలిన వారికి లేదు. మాంసాహారం కూడా కొందరికే. ఇట్లా మన మతం అధికారి భేదాన్ని గుర్తించింది. ఒక కట్టుబాటు ఉండడం వల్లనే ఎందరో మహాత్ములీ మతంలో ప్రభవించారు. గొప్ప సంస్కృతి అనాదిగా పరిఢవిల్లింది. బాబిలోనియా, ఈజిప్టు, గ్రీకు నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయినా హిందూజాతి, అవిచ్ఛిన్నంగా సాగిపోతూనే యుంది. కళలు విద్యలు, నాగరికత, సంస్కృతి ఎడదెగకుండా సాగుతూనే యున్నాయి. దీనికంతటికీ రాగద్వేషాలు లేకుండా ఆలోచిస్తే వర్ణాశ్రమ విభజనయే కారణమని అంగీకరించక తప్పదు. ఒక ప్రత్యేకమైన వర్ణానికి అనేక నియమ నిష్ఠలను చెప్పడం వల్ల వారిని ఆదర్శంగా మిగిలినవారు గ్రహించి జీవించేవారు.
No comments:
Post a Comment