పురాణాలలో కలి తీవ్రత, అతిశయోక్తులతో నిండి యుంటుంది. శంకరులవతరించడానికి ముందు వేదధర్మం అడుగంటిందని దేవతలు పరమేశ్వరునితో మొరపెట్టి నట్లుంది. శంకరులు కాలడిలో అవతరించినప్పుడు వేద ధర్మం పూర్తిగా అడుగంట లేదు.
యుగారంభంలో కలిలో ప్రవృత్తి మార్గానికి, నివృత్తి మార్గానికి అవకాశం ఉంటుందా అని ధర్మ శాస్త్రాలు చర్చించాయి. ఎంతవరకూ అగ్నిహోత్రం ఉంటుందో, వేదాధ్యయనం ఉంటుందో, వర్ణ విభజన ఉంటుందో అంతవరకూ నివృత్తి (సన్నాసం) ఉంటుందని నిర్ణయించాయి. కొడిగట్టే దశలో ఒక మహానుభావుడు వచ్చి దీపాన్ని వెలుగునట్లు చేస్తాడు. శంకరుల కాలంలో సంప్రదాయ విద్య, అవిచ్ఛినమైన గురు పరంపరతోనే సాగుతోంది. మిగతా యుగాలతో పోల్చినపుడు కొంత క్షీణ దశలో ఉండవచ్చు. లేకపోతే కర్మానుష్ఠానాలు చేసే సద్వంశంలో పుట్టడం గాని, గోవింద భగవత్పాదుల యొద్ద ఉపదేశం గాని శంకరులకు దక్కి యుండకపోవచ్చు. వీరికి ముందు కాశకృత్స్నుడు, ద్రవిడాచార్యుడు, బ్రహ్మానంది, భర్తృ ప్రపంచుడు, భర్తృహరి, బ్రహ్మదత్తుడు, సౌందర పాండ్యుడు మొదలైనవారు అద్వైతాన్ని గురించి చెప్పినవారే. పూజలూ, ఆలయాలూ ఉండేవి. తాంత్రిక పద్ధతులలో సాగేవాటికి వైదిక మార్గాన్ని బోధించి శంకరులు పునరుద్ధరించారని చదువుకున్నాం.
మరి ఎందుకు అంతా నాశనమైపోతోందని అన్నాయి? ప్రమాదపు హెచ్చరికలు చేసాయి? దొంగలుంటారు, జాగరూకత వహించండని రక్షక భటులు హెచ్చరించరా? అన్ని వస్తువులను బైట ఉంచి దొంగతనానికి ప్రేరేపిస్తామా? అట్లా కలి, ప్రవేశించిందని, ధర్మాన్ని రక్షించుకోండని హెచ్చరించడానికే పురాణాలట్లా చెప్పాయి.
ఇట్లా కలిలో తనను గురించి ఎవడు సమీపిస్తాడా అని భగవంతుడెదురు చూస్తూ ఉంటాడు (అని మహాస్వామి వారు చమత్కరించారు). అలా వచ్చిన వానిని అక్కున చేర్చుకుంటాడు.
మిగతా యుగాలలో ఎంతో ధ్యానము, యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు చేస్తేనే గాని అనుగ్రహించని దేవుడు కలిలో నామస్మరణ చేస్తేనే అనుగ్రహిస్తాడని చెప్పబడింది. అందుకే వ్యాసుడు కలిః సాధుః, కలిః సాధు: అని రెండు సార్లన్నాడు.
No comments:
Post a Comment