Thursday, 24 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 22 వ భాగం



వేదాలలో శివవిష్ణు సంబంధమైన విషయాలుంటాయి. విశిష్టాద్వైత, ద్వైత సంప్రదాయాలలో శివుని విడిచి కేవలం విష్ణు సంబంధమైన వాటినే స్వీకరించారు. అట్లే శివాద్వైతంలో శైవ సిద్ధాంతాలలో విష్ణువును విస్మరించారు.


ఇక మీమాంసకులు వేదంలోని కర్మమార్గాన్నే గ్రహించి జ్ఞాన కాండను విస్మరించారు. వేదంలో జగత్తు, మిథ్య అనే మాటనే తీసుకొని దీనికొక రూపునిచ్చి బౌద్ధం వచ్చింది. ఇట్లా పదాలలో కొంత గ్రహించడం, కొంత మానివేయడం ఇతర సంప్రదాయాలలో కన్పిస్తాయి. శంకర మతం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. శంకర సంప్రదాయంలో ఉన్నది వైదిక మతమే. వీరు వేదంలోని కర్మ, భక్తి, జ్ఞాన యోగ, ధర్మ, శివ, విష్ణు సంబంధ విషయాలన్నిటినీ గ్రహించి సమన్వయించారు. అందరి దేవతలను పూజించారు.


ఇతర మతాల గురించి


శంకరులు అసంపూర్ణ మతాలు లేకుండా ఎట్లా చేసారో వివరిస్తాను. కర్మకాండకు ప్రాధాన్యమిచ్చే మీమాసంకుల గురించి చెప్పాను. ఈశ్వరుడీ జగత్తును సృష్టించాడని వీరనరు. అతడు కర్మఫలదాత యని కూడా వీరనరు. వారికి సగుణ బ్రహ్మమూ లేదు, నిర్గుణ బ్రహ్మమూ లేదు. ధ్యానించరు. ఈశ్వరుణ్ణి పూజించరు. స్వర్గంగాని, లేదా దాని పైనున్న మోక్షంగాని కావాలన్నా కర్మానుష్ఠానం చేస్తే చాలని వారంటారు. తామే వేదాన్ని పూర్తిగా పాటిస్తున్నామని, జ్ఞానం పేరుతో కర్మను విడిచిన సన్న్యాసిని చూడడం కూడా పాపమని భావిస్తారు.


వేదాంతులతో బాటు వేదాన్ని పూర్తిగా నమ్మినవారు మీమాంసకులు. వీరు వేదంలో చెప్పబడిన కర్మలనే ఆచరిస్తారు. అవి న్యాయ, వైశేషిక, సాంఖ్య యోగాలు. వేదమంత్రాల ప్రామాణ్యాన్ని శంకించరు. అయితే తమ సిద్ధాంతాలకు వేదమే మూలమని గట్టిగా వాదించరు. అయినా మీమాంస, అసంపూర్ణమైన మతమే. పాఠశాల చదువునుండి కళాశాలలోకి వెడతాం. ఆ పాఠశాల చదువే గొప్పదంటే ఎలా?


No comments:

Post a Comment