Wednesday 9 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 7 వ భాగం



గృహస్థాశ్రమం తరువాత వానప్రస్థ, సన్న్యాసాశ్రమాలను ధర్మశాస్త్రాలు విధించాయి. ముందు ఇంద్రియ తృప్తికై కర్మలను చేసినా, కర్మయోగులై అనగా నిష్కామ కర్మయోగులై ప్రాణాలను విడిచిపెట్టేవారు. దానినే కాళిదాసు, రఘువంశంలో రాజులు చివరకు యోగులై శరీరాలను విడిచి పెట్టారని అంటాడు.


ఆనాడు కూడా కర్మను యోగంగా భావించినవారరుదే. కాని కర్మయోగుల పట్ల, జ్ఞానయోగుల పట్ల అధికాదరణ యుండేది. రాను రాను ఫలాలను ఆశించేవారెక్కువయ్యారు. ఇదే మంచిదని, సన్న్యాసం తప్పని భావించారు. రానురాను, ఈశ్వరుడు, ఆత్మసాక్షాత్కారం అనే మాటలకు స్వస్తి చెప్పి వేదంలో చెప్పిన కర్మలను చేస్తే అవే ఫలాలనిస్తాయని భావించేరు. ఈశ్వరుడు, ఫలదాత అనే మాటలను విసర్జించారు. కర్మలు చేస్తేనే స్వర్గ ప్రాప్తియనే మాటను గట్టిగా నమ్మారు, మోక్షమనేది, కేవలం జ్ఞాన విచారం వల్ల రాదని భావించారు. స్వర్గం కంటే మోక్షం ఎక్కువని భావించినా అది వస్తే రానీయండి, అనే ధోరణి ప్రబలింది. వేదం చివర భాగంలో ఉన్న ఉపనిషత్తు జ్ఞాన మార్గం చెప్పగా అది ఉత్తరమీమాంసయని; కర్మ భాగం చెప్పేది పూర్వమీమాంసగా ప్రసిద్ధిని పొందింది.


రెండు మార్గాల ఉపదేశాలు


నివృత్తి మార్గానికి, దక్షిణామూర్తి ముఖ్య గురువు. విష్ణువు కూడా హంస, దత్తాత్రేయ, హయగ్రీవ రూపాలలో అవతరించాడు. అయితే దశావతారాలలో చూపించినట్లుగా పూర్తిగా వీటిల్లో తన శక్తిని ప్రదర్శించలేదు. దక్షిణామూర్తి మౌఖికంగా ఉపదేశించలేదు గాని, ఆత్మానుభవాన్ని భక్తులు పొందునట్లు చేసాడు. అట్లాగే హయగ్రీవుడు మొదలగు దేవతలను కొలవగా వారి అనుగ్రహాన్ని చూపించారు. పరమ శివునికే, నివృత్తి మార్గోపదేష్టగా పట్టం కడతారు. దత్తాత్రేయుడు, సనకాదులూ నివృత్తి మార్గాన్ని ఉపదేశించారు. అయితే ఉపదేశమే వారి అవతార లక్ష్యమని ప్రకటించలేదు. అయితే నివృత్తి మార్గం, సామాన్యులకు అందేది కాదు. అందువల్లనే ఎందరో మహాత్ములను పంపి తాను దిగివచ్చి ఉపదేశం చేసాడు. గీతలో, భగవానుడే సూర్యునకు అనగా వివస్వంతునకు, కర్మఫలాలను ఆశించకుండా కర్మలను చేయాలని, అపుడది కర్మయోగమని పిలువబడుతుందని చెప్పాడు. సూర్యుడు తన కొడుకైన వైవస్వత మనువుకు ఉపదేశించాడు. అతని పేరుతోనున్న వైవస్వత మన్వంతరంలో మనమున్నాం. అతడు తన కొడుకునకు - ఇట్లా పరంపరగా ఉపదేశం సాగింది. ఇట్లా గీతలో కర్మయోగ, జ్ఞానయోగాలు చెప్పబడ్డాయి. మరి భక్తి యోగం మాటేమిటి? జ్ఞానయోగంలో కర్మానుష్ఠానం లేదు. ధ్యాన విచారణలే ఉంటాయి. భక్తిలో పూజలు మొదలైనవి ఉంటాయి. ఇవే కర్మలు లేని ధ్యానంలో ప్రవేశపెడతాయి. అనగా సవికల్ప సమాధి ఏర్పడుతుంది. అందే పరమేశ్వరునితో ఐక్యం.


No comments:

Post a Comment