Wednesday 23 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 21 వ భాగం

 

అయితే అందరూ శంకర సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారా? లేరు. రామానుజ, మధ్వ, శ్రీ కృష్ణ చైతన్య, వల్లభాచార్య, శ్రీ కంఠాచార్య, మేయ కండర్ మొదలైనవారి సంప్రదాయ వాదులున్నారు. ఇవన్నీ శంకరుల తరువాత వచ్చిన సంప్రదాయాలే. ఒక్క అద్వైతం, అవిచ్ఛిన్నంగా వస్తోంది. శంకరులు తరువాత వచ్చిన వారు శంకర సంప్రదాయాన్ని నిర్మూలించలేకపోయారు. రామానుజులు వచ్చిన తరువాత, అద్వైతం కనుమరుగైపోయిందా? మధ్వాచార్యులు వచ్చిన తరువాత అద్వైతం, విశిష్టాద్వైతం లేకుండా పోయాయా? ఇతర సంప్రదాయాలను క్రొత్తగా వచ్చినవి నిర్మూలింపలేకపోయాయి. శంకరుల కాలంలోనే అందరూ అద్వైత సంప్రదాయానికి తల ఒగ్గారు. వారి తరువాత చాలాకాలం వరకూ అట్లాగే సాగింది. అందుకే వారు జగద్గురువులయ్యారు. ఈ బిరుదు కేవలం గౌరవంతో పెట్టింది కాదు.


జగత్ అనినపుడు మిగతా దేశమతాల ప్రస్తావన తీసుకొని రానవసరం లేదు. ఈ దేశం కర్మభూమి కనుక, ప్రపంచానికే గుండెకాయ వంటిది. కనుక, దీని గురించి మాట్లాడదాం. భారతదేశం పూర్వకాలంలో భరత ఖండంగా ప్రసిద్ధి. ఇది ఎంతో విస్తరించిన ప్రాంతం, అంగ, వంగ, కళింగాది 56 దేశాలతో ఉండేది. ఆచార్యులు వాటన్నిటిలోనూ పర్యటించి మిగతా మతాల ఖండన చేసి అద్వైత స్థాపన చేసారు. కనుక వీరికి జగద్గురుత్వం వచ్చింది.


శంకర సంప్రదాయమే వైదికం, అన్నిటిని సమన్వియించేది


ఈనాడే సంప్రదాయమున్నా అన్నిటికీ వేదమే కదా ఆధారం. మిగిలిన వారు వేదాన్ని అంగీకరించినా లేకపోయినా మిగిలిన దేశాలలో అనుసరించేవాటికి కూడా మూలాలు వేదంలో కన్పిస్తాయి. ఈనాటికీ సిద్ధాంతాలే కాదు, కర్మకాండ యొక్క ఛాయలూ మిగతా దేశాలలో కన్పిస్తాయి (లోగడ ఉపన్యాసాలలో అనేక ఉదాహరణలను స్వామివారు పేర్కొన్నారు. చూ. అమృతవాణి-6).


No comments:

Post a Comment