(కుంభకానికి పదహారు మాత్రలు కావాలి. పూరకానికి అరవై నాలుగు మాత్రలకాలం, రేచకానికి ముప్పది రెండు మాత్రల కాలం - అన్నీ పదమంజరీ టీక) ఎడమ ముక్కుతో పూరించి కుడిముక్కుతో రేచకం చేసినట్లే కుడిముక్కుతో పూరించి ఎడమ ముక్కుతోనూ విడువవచ్చు. పూరించి లోపల కుంభించినట్లే వాయువును విడిచి పెట్టి బయట కుంభించవచ్చు. ఈ ప్రాణాయామంవల్ల పిండ (శరీర) శుద్ధి అవుతుంది. శరీరంలోని వాతపిత్తాది ప్రకోపాలు సమస్తమూ శాంతిస్తాయి. నాడీద్వారాలు అన్నీ నిర్మలినాలు అవుతాయి. క్రమాభ్యాసంలో యోగ నిరోగి అవుతాడు. ఈ ప్రాణాయామంలో సబీజమూ, నిర్భీజమూ అని రెండు విధాలున్నాయి. ప్రణవమంత్ర సహితమైతే సబీజం ప్రణవమంత్ర రహితమైతే నిర్వీజం. వీటినే సగర్భము. నిర్గర్భమూ అని కూడా అంటారు.
ప్రాణవాయువు ఇలా వశమైన తరువాత విషయ సుఖాల నుంచి ఇంద్రియాలను మనస్సుతో ప్రయత్న పూర్వకంగా ఉపసంహరించాలి. దీన్నే ప్రత్యాహారం అంటారు.
ఇక ధారణ అంటే ఆత్మలో మనస్సుని నిలపడం. ఇది సగుణమనీ, నిర్గుణమనీ రెండు రకాలు. చెదిరిపోయే మనస్సును మాటిమాటికి ప్రయత్న పూర్వకంగా బంధించి తెచ్చి ఆత్మలో స్థిరపరచాలి. దీనికి అభ్యాసబలం చాలా కావాలి. అలా స్థిరీకరించడాన్నే ధ్యానం అంటారు. మరికొందరు ఏమన్నారంటే - పన్నెండు ప్రాణాయామాలు ఒక ప్రత్యాహారమనీ పన్నెండు ప్రత్యాహారాలు ఒక ధారణ అనీ, పన్నెండు ధారణలు ఒక ధ్యానమనీ, పన్నెండు ధ్యానాలు ఒక సవికల్ప సమాధి అని చెప్పారు.
ఈ అష్టయోగాంగాలతో మనస్సును స్థిరపరచుకొని అది మనన క్షమం అయ్యాక - పరమాత్మను గురించి వేద శాస్త్రాలు చెప్పిన మహావాక్యాల్ని ఏకార్ధ సమన్వయంతో మననం చెయ్యాలి. నిరంతర మననాన్నే పెద్దలు ధ్యానమన్నారు. సవికల్ప సమాధినే "నిధిధ్యాసము" అంటారు. విజాతీయులైన కామక్రోధాదుల్ని నిరసించి "అహంబ్రహ్మస్మి" అనే సజాతీయ భావనను నిరంతరంగా ప్రవాహ సదృశంగా సాగించవలసిన స్థితి నిధి ధ్యానం. ఇదే సవికల్ప సమాధి. ఇది అల్పయోగులకు దుర్లభం. తత్వమసి అనే మహావాక్యార్ధాన్ని షడ్విధలింగాల సహాయంతో సద్గురువు నిర్ధారించి శిష్యుడికి బోధించడం అయ్యాక దాన్ని శిష్యుడు ధారణ, చింతన, మననం, ధ్యానం వగైరాలతో వశీకరించుకున్నాక. అప్పుడు, విజాతీయులను నిరసించి "అహంబ్రహ్మస్మి" అనే సజాతీయ భావనను ప్రవాహీకరించుకునే స్థితి. ఇది అల్ప యోగులకు ఎంత దుర్లభమో ఆలోచించు. ఈ సవికల్ప సమాధిలో జ్ఞాతృత్రేయ విభాగం వుంటుంది. అవి కూడా లయమైపోయిన అవిభాజ్య పరతత్వస్థితి నిర్వికల్ప సమాధి.