Monday, 1 May 2023

శ్రీదత్త పురాణము (125)

 


మంత్ర తంత్ర శాస్త్రాలు


శచీపతి! మరొక ఉదాహరణ చెబుతాను. ఆలకించు. వెనుకటికి విశాలనగరంలో వేదశర్మ అనే ఒక పండితుండేవాడు. శాంతి (బహిరింద్రియ నిగ్రహం) దాంతి (అంతరింద్రియ నిగ్రహం) ఉన్నవాడు. అరిషడ్వర్గాలను జయించినవాడు. వేదధర్మాలను తు.చ. తప్పకుండా పాటించేవాడు. ఇతడికి ఒక కుమారుడు కలిగాడు. సుశీలుడు అని నామకరణం చేశాడు. ఆ బిడ్డడు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలు ఏమోగానీ పుట్టినప్పటి నుంచీ ఏడుగురు బ్రహ్మరాక్షసులు అతణ్ణి ఆవరించారు. ఆ ఏడుగురు పరస్పరం కలహించుకుంటూ పరస్పరం వధించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంటే సుశీలుడు విలవిలలాడిపోతూ దారుణంగా రోదించేవాడు. ఒక్కొక్కసారి విపరీతంగా నవ్వేవాడు. గంతులు వేసేవాడు. నృత్యం చేసేవాడు. ఉన్నట్టుండి మూర్ఛపోయేవాడు. ఇతడి చేష్టలన్నీ వింతగానూ విపరీతంగానూ ఉండేవి. తినటం మొదలు పెడితే భక్ష్యాభక్ష్య వివేచన లేకుండా అమితంగా తినేవాడు. మానేస్తే ఘోరంగా పస్తులుండేవాడు. ఉన్నట్టుండి ఘోరంగా రోదించేవాడు. బాధ ఏమిటో నివారణోపాయం ఏమిటో ఏమీ తెలియక వేదశర్మ దంపతులు పడే ఆవేదనకు అంతు ఉండేదికాదు. దెయ్యాలో భూతాలో పట్టుకున్నాయని వాటిని వదిలించాలనీ ఆ పండితుడు చాలా ప్రయత్నాలు చేశాడు. హోమాలు చేశాడు. వ్రతాలు చేశాడు. నోములూ తీర్థయాత్రలూ అన్నీ అయ్యాయి. ఫలించలేదు. ఏదీ


ఒక రోజున వేదశర్మ వైశ్వదేవం ముగించుకుని అతిథి కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకానొక బిక్షువు వచ్చాడు. దుమ్ముకొట్టుకుపోయినట్టు ఒళ్ళంతా బూడిద. మాసిపోయి పీలికలుగా వేలాడుతున్న గుడ్డలు. గుప్పుమని కొడుతున్న దుర్గంధం. ఈగలూ, మసములూ ముసురుతున్నాయి. అభ్యాగతః స్వయం విష్ణుం అన్నారు గదా అని ఆ బిక్షువుకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆదరాతిశయంతో ఆతిధ్యం ఇచ్చి తాము కూడ ప్రసాదం స్వీకరించివచ్చి భిక్షువుకి వింజామర నిస్తూ కూర్చున్నాడు. ఎందుకో వేదశర్మ మనస్సులో ఈయన దత్తాత్రేయుడు కాదుకదా అనే ఆలోచన మెదిలింది. దత్తదేవుడు ఈ నగరంలోనే సంచరిస్తున్నాడనీ భిక్ష స్వీకరిస్తున్నాడని వింటున్నాను. ఈయనే దత్తదేవుడైతే అంతకన్నా కావలసింది ఏముంది? నా జన్మ తరించినట్టే అనుకున్నాడు. క్రమక్రమంగా ఆలోచన బలపడింది. దత్తాత్రేయుడే అని నిశ్చయం కలిగింది. అంతలోకి ఆ భిక్షువు నేనింక వెడతానంటూ బయలుదేరాడు. బయలు దేరడమేంటి రెండు అంగల్లో వీధిలో నిలిచాడు. వేదశర్మ అతడి వెంటబడ్డాడు. భిక్షువు-పొమ్మంటున్నా వినకుండా వెంబడించాడు. చేతికి అందిన కర్రతో రాయితో ఇటుకముక్కతో అదీ ఇదీ అని లేదు ఏది దొరికితే దానితో వేదశర్మను కొడుతున్నాడా భిక్షువు. అయినా ఇతడు వెంటబడుతూనే ఉన్నాడు. దెబ్బలు ఓర్చుకుంటున్నాడు. నెత్తురు కారుతున్నా లెక్కచేయడం లేదు. వెంట నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చచ్చిపడి ఉన్న గాడిద కళేబరం కనిపించింది. దాని శరీరం నుంచి ఇంత మాంసం ముద్ద పెకిలించి ఆ భిక్షువు వేద శర్మదోసిట్లో పడేసి "ఇంద తిను" అన్నాడు. వేదశర్మ భద్రంగా ప్రసాదంలా ఆ ముద్దను అలాగే దోసిట పట్టుకొని అతడివెంట నడిచాడు. చేరువకు రానిచ్చి భిక్షువు కాలితో ఒక్క తాపు తన్నాడు. వేద శర్మ తట్టుకొని నిలబడ్డాడు. చకచకా పరుగులాంటి నడకతో భిక్షువు వెళ్ళి వెళ్ళి ఒక కొండ గుహలో దూరాడు. వేదశర్మ కూడా ప్రవేశించాడు. అక్కడ ఒక శిలావేదిక మీద కూర్చుని ఆ భిక్షువు - ఏమయ్యా నావెంట బడ్డావు? తిట్టినా వదలవు. కొట్టినా వదలవు. నాతో ఏమిటి పని? చూస్తున్నావుగా కంపుగొడుతున్న నా రూపాన్ని, నేనేమి చెయ్యగలనని? ఏమికోరి నా వెంట బడ్డావు? రూక్షంగా ప్రశ్నించాడు.


No comments:

Post a Comment