Friday 12 May 2023

శ్రీదత్త పురాణము (136)

 


విష్ణుదత్తుడు సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు. మళ్ళీ ఎప్పటి లాగానే తన దైనందిన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి మంచి పనులు ఇతడు ఇంకా చాలా చేసాడు. దత్తుడి అనుగ్రహం వల్ల ఇతడిలో అభిమానంగానీ అహంకారంగానీ ఏనాడూ ప్రవేశింపలేదు. మంత్రశక్తితో అద్భుతాలు చెయ్యగలిగినా అతడు అలా చెయ్యలేదు. తక్కిన శాస్త్రాల పట్ల విశ్వాసాన్ని పోగొట్టలేదు. లోకంలో స్థిరపడిన పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తింపలేదు. శాస్త్రప్రకారం ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయనీ సత్కర్మాచరణమే అన్నింటికి ఉత్తమోత్తమమనీ లోకులు గుర్తించేట్లు చేసాడే తప్ప తన మహిమను చాటుకునే ప్రయత్నం ఏమాత్రమూ చేయలేదు.


దేవేంద్రా నేను రచించి శిష్యులకు బోధిస్తున్న ఈ ఆయుర్వేద మంత్రతంత్ర శాస్త్రాలు సంగీత నృత్యాదికళలూ - ఇవన్నీ పరంపరగా దైవభక్తిని ప్రోగు చేసేవేనని అవిద్యను నశింపజేసేవేననీ ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఇవి భోగ పరాలుకావు. మోహకారకాలు కావు. ఇవి అర్ధ సంపాదన పరాలు కావు. శత్రువులను చంపడానికో, అభిచారక్రియలు (చేతబడులు) చెయ్యడానికో వశీకరణాది క్షుద్రవిద్యలు సంపాదించడానికో నేను ఈ శాస్త్రాలు లోకానికి అందించడం లేదు. వీటి పరమ ప్రయోజనం అదికాదు.


విషయలోలుడైన జనుల్ని మంచి మాటలతో మళ్ళించి తత్వనిష్టుల్ని చెయ్యడం ఒక్కటే శాస్త్రాల యొక్క చివర ఫలం. ఇలా క్రమంలో శుద్ధి పొందాక తత్వమసిలాంటి మహావాక్యాలను వారికి భోదిస్తే హృదయాల్లోకి ఎక్కుతాయి. వేదాంత భావన వారిలో స్థిరపడుతుంది. పీడాతురునికి ముందు రోగాలు నయంజేసి అటుపైన మంత్రోపదేశం చేసాడు విష్ణు దత్తయోగి. అందుకని అతడు కృతకృత్యుడు కాగలిగాడు. రోగాలు తగ్గనంత సేపూ ఎవరికీ ఏ వేదాంతమూ తలకెక్కదు. అందుచేత మూఢలోకానికి సద్గురువు అవసరం ఎంతైనావుంది. అతను క్రమక్రమంగా వారికి అంతశ్శుద్ధిని కలిగించి మహా వాక్యాలను ఉపదేశించి స్వస్వరూప పరిజ్ఞానంతో ఆనందోపలబ్ధిని ప్రసాదిస్తాడు. ఈ మార్గంలో క్షణంలో కృతకృత్యుడు కాగలుగుతాడు. ఇక్కడ మరో ఉదాహరణ చెబుతాను విను. అనగ అనగా ఒక విప్రకాంత బిడ్డడికి జ్వరం వస్తే గృహవైద్యం చేస్తుంది. కషాయం పాత్రలో పోసి ఇచ్చి తాగ మంటుంది. బతిమాలుతుంది. బెదిరిస్తుంది. భయపెడుతుంది. ఆ బిడ్డడు త్రాగడం లేదు. ససేమిరా త్రాగనని అంటున్నాడు. కటికి చేదు కషాయాన్ని ఎలా త్రాగుతాడు? అది మందు అనీ త్రాగితే జ్వరం తగ్గుతుందనీ వాడికేమి తెలుసు? చెబితే మాత్రం గ్రహించగల బుద్ధి వికాసం అతనికి లేదు. త్రాగను అంటే త్రాగను అంటున్నాడు. ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. లోపలికి వెళ్ళి ఇంత పటికబెల్లం పట్టుకొచ్చింది. కషాయం త్రాగు పటికబెల్లం పెడతానని అంది. ఆ బిడ్డడు వెంటనే త్రాగేశాడు. తల్లి ఆ తెచ్చిన పటిక బెల్లంలోనే పిసరంత పెట్టి పంపించింది. మళ్ళీ వచ్చి అడిగితే ఇంకొంచెం పెట్టింది. ఇలా కొంచెం కొంచెం పెట్టి ఆ బిడ్డడు ఆట పాటల్లో పడిపోయే సరికి పటిక బెల్లాన్ని మొత్తం దాచేసింది.


సురేశ్వరా ఈ శాస్త్రాలు ఈ కళలూ కలకండ ముక్కల్లాంటివి. తత్వోపదేశమనే కషాయాన్ని త్రాగడానికి అవి ఉపకరిస్తాయి. కైవల్యమే అసలుసిసలైన ఆరోగ్యం. అదే చివరఫలం.


No comments:

Post a Comment