దత్తస్వామి దయవల్ల నేను ఏదయినా చెయ్యగలను. కానీ చేసిన పని లోకానుగుణంగా వుండాలి. లోక విరుద్ధంగా చెయ్యడం సజ్జనపద్ధతి కాదు. అందుచేత ఈ రోగిని హఠాత్తుగా కాకుండా క్రమక్రమంగా ఆరోగ్యవంతుడ్ని చేస్తాను అని ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ ఇలా అన్నాడు. మీకు తెలియనిది కాదు. రోగాలు దుష్కర్మల ఫలాలుగా వస్తాయి. వాటిని గుర్తించి ప్రాయచ్ఛిత్తం చేసుకోవడమే సరి అయిన మందు. అసలు సిసలైన వైద్యం. అందుచేత ఇతడి కర్మవిపాకం గురించి ఆలోచించాలి. ప్రాయశ్చిత్తాలను ఇతడి భార్య ఆచరించవలసి వుంటుంది. బ్రహ్మ హత్యాపాతకం చేస్తే క్షయరోగం వస్తుందంటారు. దీనికి ప్రాయశ్చిత్తంగా పన్నెండు సంవత్సరాల వ్రతముంది. వాత గుల్యానికి ఆరేళ్ళ వ్రతం, హరిద్రోహానికి ఫలంగా జలోదరం సంక్రమిస్తుంది. ఇది చాలా కఠినమైన రోగం. దీనికీ పన్నెండేళ్ళ వ్రతమే ప్రాయశ్చిత్తం. ఇవి మూడూ ఇతన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన రోగాలు. భగంధరం దీనికి మూడేళ్ళ వ్రతం ప్రాయశ్చిత్తం. ఈ వ్రతాలన్నింటినీ ఒకేసారి ప్రారంభించవచ్చు. సగంలోకి వచ్చేసరికి రోగాలు సగం తగ్గుతాయి. పూర్తిగా వ్రతాలు సమాస్తి అయ్యేసరికి రోగాలు నయమవుతాయి.
విష్ణుదత్తుడు చెప్పిన దానికి అందరూ అంగీకరించారు. సుమేధకు సహకరిస్తామని మాట ఇచ్చారు. ఆ ఇల్లాలు వెంటనే వ్రతాచరణ మొదలు పెట్టింది. ఆ రోజే గుణం కనబడింది. మూడేళ్ళు అయ్యేసరికి పూర్తిగా భగందరం తగ్గిపోయింది. ఆరేళ్ళ అయ్యేసరికి వాతగుల్మం అంతరించిపోయింది. పన్నెండు ఏళ్లకి క్షయ జలోదరాలు పూర్తిగా ఉపశమించాయి. పీడాతురుడు కోలుకున్నాడు. ముఖంలోకి తేజస్సు కనిపించింది. విష్ణుదత్తుడు అప్పుడప్పుడు ఏవో రసగుళికలు ఇస్తూ వుండేవాడు. వాటితో జీర్ణజ్వరమూ అతిసారమూ ఉపశమించాయి. అంతా కుదుటబడిందని వార్త అందగానే విష్ణుదత్తుడు బయలుదేరి వచ్చాడు. పీడాతురుడి హృదయం మీద తన చెయ్యి అన్చి ఆనాడు దత్తస్వామి తనకు ఉపదేశించిన మహామంత్రం జపించాడు. పీడాతురుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో లేచి కూర్చున్నాడు. వారింట ధన ధాన్య సమృద్ధి ఏర్పడింది. దంపతుల మనస్సులో హరి భక్తి కుదురుకొంది. వారి బలవంతం మీద విష్ణుదత్తుడు వారింట్లో మూడు రోజులు వున్నాడు. సాటి విప్రులతో గోష్టి కార్యక్రమాలతో హాయిగా గడిపాడు. ఆ దంపతులు ఇతడ్ని కన్న తండ్రిలా చూసుకున్నారు. ఇతడూ వారిపట్ల అలాంటి ప్రేమనే చూపించాడు. మూడురోజులూ మూడు క్షణాల్లా గడిచిపోయాయి. ఆ మర్నాటి ఉదయం నూతన వస్త్రాలతో పూలదండలతో విష్ణుదత్తుడ్ని పూజించి ఆ దంపతులు ఆశీస్సులందుకొని ప్రేమగా అర్ధంగా వీడ్కోలు పలికారు.
No comments:
Post a Comment