Friday 5 May 2023

శ్రీదత్త పురాణము (129)

 


ఓరి మూఢుడా నన్ను ఏడిపించుకుతింటావేమిరా? నిన్ను చంపేస్తాను నీకసలు నాతో పని ఏమిటి? - అని వికృతాకారుడు కర్ణకఠోరంగా గద్దించాడు. అయినాసరే తన పని సాధించుకోవాలనే పట్టుదలతో విష్ణుదత్తుడు పాదాలు వదలలేదు. అప్పటికి స్వామి ప్రసన్నుడయ్యాడు. వికృతాకారం వదిలేసాడు. మృదువుగా శ్రావ్యంగా ఇలా అన్నాడు. విష్ణుదత్తా! ఈ వికృతాకారుడితో నీకు పని ఏమిటయ్యా? నాకోసం మూడుమార్లు వచ్చావు అన్నాడు. స్వరంలో వినిపించిన మార్ధవం మాధుర్యం విష్ణుదత్తుణ్ని పులకింపజేశాయి. వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లయ్యింది. పట్టుకున్న కాళ్ళు, నేలా రమణీయంగా మారిపోయాయి. విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరచాడు. ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచు వ్రేళ్లాడుతూ కనిపించింది. నల్ల కలువలు లాంటి పాద పద్మాలు తనచేతుల్లో వున్నాయి. ఆ పాదాలపై శిరస్సు ఆన్చి గబగబా మూడుమార్లు కళ్ళకి అద్దుకున్నాడు. లేచి నిలబడ్డాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖారవిందంతో పర్ణశాలముందు గున్నమావిచెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు దివ్యాభరణ, దివ్యాంబరములు ధరించిన వాడు, తులసీదళదామ విరాజితుడు, పుసుమాలికా సమలంకృతుడు, పారిజాత పరిమళాలు వెదజల్లుతూ దర్శనమిచ్చాడు. కనుచూపు మేరలో ఎక్కడా వెలివాడ లేదు. మాంసపు ముద్దలూ లేవు. కంటికి ఇంపుగొల్పే పచ్చని ఆశ్రమ వాతావరణం పర్ణశాలలు, కుటీరాలు. శుచియై శాంతుడై ఎట్టఎదుట ఆశీనుడైవున్న దత్తస్వామికి మళ్ళీ మళ్ళీ సాష్టాంగ దండప్రణామాలు చేసి ఆనందభాష్పములతో దోసిలి యొగ్గి ఆనందభాష్పములతో నిండిన కళ్ళను తుడుచుకొని గద్గద స్వరంతో ఇలా పలికాడు.


మహేశా! ఈ జగతీ తలంలో నేను ధన్యుణ్ని. నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. యోగి వంద్య పదార విందుడవైన నీ దర్శన భాగ్యం కలిగింది - అని మరొకసారి పాదాల మీద పడ్డాడు. విష్ణు దత్తా నాతో నీ పనేమిటో చెప్పావు కాదు అన్నాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పిన మాటల జ్ఞాపకం వచ్చాయి. అడగవలసింది ఏదో స్ఫురించింది. స్వామి ఈ రోజు మా తండ్రి గారి ఆబ్ధికం. తమరిని భోక్తగా నియంత్రించుకుంటాను. తమరు తప్పకుండా రావాలి - అన్నాడు. విష్ణుదత్తుడి అభ్యర్ధననూ స్వామి అంగీకరించారు. అలాగే తప్పక వస్తాను. నువ్వు ముందు నడువు కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీవెనుకనే నీ ఇంటికివస్తాను. నీ ప్రయత్నం సఫలం అయ్యింది కదా ఇకపద అన్నారు దత్తస్వామి.


విష్ణుదత్తుడు పరుగుపరుగున ఇంటికి చేరుకున్నాడు. పట్టరాని ఆనందంతో ఒగురుస్తూ సుశీలమ్మకు జరిగిందంతా పూసగ్రుచ్చినట్లు వివరించాడు. శ్రాద్ధవిధికి వంట సిద్ధం చెయ్యమన్నాడు. అవిడ కూడా చాలా సంబర పడింది. స్నానం చేసింది. తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోయింది. విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తున్నాడు. సరిగ్గా వంట అయ్యింది. దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమైనాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలిచ్చి లోపలికి తీసుకొచ్చాడు. మడి బట్టలు కట్టుకుని పీట మీద కూర్చున్నాడు. సుశీల అరిటాకులందించింది. సాధ్వీ! నా సహపంక్తికి మిగతా ఇద్దరూ ఏరి? నాలాటి వాళ్ళని ఎవరిని పిలిచారు? అని అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నించాడు. అప్పటికి గాని గుర్తురాలేదు, మిగతా ఇద్దరినీ పిలవలేదని. గాబరాపడకుండా, గంభీరంగా సమాధానం చెప్పింది, సుశీల. దేవదేవా నీతో సమానుడైన భోక్త ఉన్నాడు, వస్తున్నాడు అంటూ వంటింటిలోంచి పెరట్లోకి వచ్చింది. ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు ధగధగలాడుతు కనిపించాడు. సుశీల సూర్యునికి నమస్కరించి సూర్యదేవా జగదేకబంధు, సర్వాత్మకా సర్వదీపాక్షి నమోనమః. రవి ప్రభూ! అచేతనమైన ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు. సర్వదష్టపూ సర్వాత్మకుడవూ పరాత్పరుడవూ అయిన నిన్ను నీను ప్రత్యక్షంగా పిలివవలసింది ఏముంది? మాయాశక్తి సంపన్నుడైన నువ్వు ఈ వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిచ్చేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుచున్నావు..


No comments:

Post a Comment