వేదశర్మ అపుకోలేని దుఃఖంతో భళ్ళుమన్నాడు. భిక్షువు పాదాల మీద పడ్డాడు. తన ఒక్కగానొక్క కొడుక్కి పట్టిన దురవస్థను చెప్పి వాడి దుఃఖాన్ని తొలగించమని అర్ధించాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. ఏడు మంత్రాలను బీజాక్షర సహితంగా ఉపదేశించాడు. నీ కొడుకుని ఏడుగురు బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు. రోజుకొక మంత్రాన్ని జపించి ఆ ఉదకాన్ని బిడ్డడి మీద జల్లు, ఒక్కొక్క రాక్షసుడూ వదిలిపోతాడు. ఒకేసారి ఏడుగురునీ వెళ్ళగొట్టడం ఏ మంత్రానికీ సాధ్యంకాదు. అదీగాక - ఒక మూఢుణ్నీ విద్వాంసుణ్ని చెయ్యాలంటే అన్ని శాస్త్రాలూ ఒకేసారి నేర్పుతామా? కొన్ని అవిద్యల్ని న్యాయశాస్త్రంతో, కొన్నింటిని మీమాంసాశాస్త్రంతో, సాంఖ్యంతో కొన్నింటిని పతంజలి యోగ విద్యతో కొన్నింటిని - ఇలా క్రమక్రమంగా అవిద్యావాసనలను పూర్తిగా తొలగించి చిత్త పరిశుద్ధి చేసి అప్పుడుగదా బ్రహ్మవిద్యను ఉపదేశించాలి. అలాగే ఈ బ్రహ్మరాక్షసుల్ని కూడా ఒక్కొక్కరుగానే వెళ్ళగొట్టాలి. ఆటుపైని నీ బిడ్డడు నీ అంతటి పండితుడూ కర్మతుడూ అవుతాడు. ఇక వెళ్ళు- అన్నాడు.
విప్రుడు పునఃపునః నమస్కరించి ఇంటి దారి పట్టాడు. ఇందాక గాడిద కళేబరం కనిపించినచోట ఇప్పుడు రక్తచందన వృక్షం కనిపించింది. తన చేతిలోని మాంసపుముద్ద రక్తచందన పుష్పమయ్యింది. భిక్షువు దత్తుడే అని ధృడమయిన నమ్మకం కలిగింది. ఇంటికి వచ్చాడు. నియమ నిష్టాగరిష్ఠుడై క్రమం తప్పకుండా రోజుకు ఒక మంత్రాన్ని తీవ్రంగా జపించాడు. మొదటి రోజున దుర్ధరుడు అనే రాక్షసుడు ఘోరంగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ రోజుతో బిడ్డడు ఏడవటం మానేశాడు. ఇలాగే ఆయా మంత్రాల తేజస్సులు తట్టుకోలేక మిగతా ఆరుగురు రాక్షసులు పరుగు పరుగున పలాయనం చిత్తగించారు. ఏడవరోజుకి సుశీలుడు తన సహజమైన రూపాన్నిపొంది రోగ విముక్తుడై హాయిగా సుఖంగా తల్లిదండ్రుల్లోకి వచ్చాడు. దేవేంద్రా విన్నావు గదా! ఇప్పుడేమంటావు. మంత్ర తంత్ర శాస్త్రాలను క్షుద్ర శాస్త్రాలంటావా! లేదా పరంపరగా ముక్తిసాధనాలు అవుతాయని ఒప్పుకుంటావా! బాగా ఆలోచించి చెప్పు, ఇప్పుడు నాలుగో నిదర్శనం కూడా చెబుతాను. అది కూడా శ్రద్ధగా విను అని బృహస్పతి ఇలా చెప్తున్నాడు.
No comments:
Post a Comment