Friday, 26 May 2023

శ్రీదత్త పురాణము (150)

 


ఈ జగత్తు ఇదివరకు పుట్టలేదు. ఇప్పుడు పుట్టడం లేదు. ఇక ముందు పుట్టబోదు. దీని ఉనికికి సంబంధించిన భాసమంతా మృషాభాసమే. ఇది మాయా మనోమయం (మనఃకల్పితం) ఇది అంతా భ్రమ అని తెలుసుకున్నవాడికి ఇంక ఏ సందేహం లేదు. అలాగే ఈ జగద్భ్రాంతిని తొలగించుకుంటే ఇంక సందేహాలు వుండవు. ఈ జగత్తు సత్యమే అంటున్న వారు కొందరు ఉన్నారు. మరి దాని సంగతి ఏమిటి అన్నట్లయితే అదీ చెబుతాను. తెలుసుకో ఆ మాటను నువ్వు విశ్వసించేటట్లయితే చిత్తవిశుద్ధికి కర్మలు చేయి. (నిత్యకర్మలు) నిషిద్ధాలైన కామ్యకర్మలను, కుటిల కర్మలనూ వదిలేసెయ్యి. ఈ కర్మఫలాలు అన్నింటినీ ఈశ్వరార్పణం చెయ్యి. మనస్సును భక్తితో తత్ప్రణం చెయ్యి. ప్రేమతో ఈశ్వరుణ్ని భజించు. ఆత్మవిశుద్ధి కలుగుతుంది. విశుద్ధాత్మ ఈ జగత్తు భ్రాంతి జన్యమనీ, అనిత్యమనీ, నశ్వరమనీ, మృషాకల్పితం అని గ్రహిస్తుంది. అప్పుడు విరక్తవుతుంది. బ్రహ్మ భువనపర్యంతరం సమస్త సృష్టి నశ్వరమనీ అమంగళమని గ్రహించినవాడు అతి నిర్మలుడవుతాడు. బ్రహ్మజ్ఞానానికి అధికారి అవుతాడు. దేవుడి పట్లా గురుదేవుడి పట్లా అత్యంత భక్తి కలిగిన మహాత్మునికే నేను చెబుతున్న ఈ మహా విషయాలన్నీ అవగతమవుతాయి. మనస్సు నుండి ఈ దృశ్యప్రపంచాన్ని తొలగించటం ఒక్కటే నిర్వాణనిర్వతి. అదే ముక్తి రూప ఆనందం. దీనికంతటికీ గురు అనుగ్రహం ఉండాలి. అది ఉన్నప్పుడే సత్యాసత్య - ఆత్మానాత్మ విచారణ సాగుతుంది. విచారణ వల్ల పరతత్వం ప్రకాశమవుతుంది. కార్తవీర్యవృపాలా, నువ్వు యాగయోగాది సత్కర్మలన్నీ మదర్పితంగా చేసావు. నేను సంతసించాను. అందుకని ఈ చర్య ఈ విచారణ ఇలా ఆరంభమై సాగింది. దీనితో నీ భ్రమ దృష్టి తొలగి మనస్సు నిర్మలమయ్యింది. గొప్ప వైరాగ్యం కలిగింది. ఇక ఇప్పుడు నీకు పరబ్రహ్మతత్వాన్ని ప్రత్యేకంగా ప్రభోదించటం కేవలం వృధాగా ఆయాసపడటం మాత్రమే అవుతుంది.


రాజా ఈ మొత్తం ప్రభోదానికి శాస్త్రవేత్తలు చెప్పిన ఉపక్రమోప సంహారాలు క్రోడీకరించి చెబుతాను విను. పరమాత్మ ఒక్కడే వస్తుమాత్రుడు. చిదాత్మకుడు. అతడే సత్యమూ నిత్యమూ అనాద్యవిద్య వల్ల అతడిలో జీవేశ్వర విభాగము భాసిస్తోంది. భ్రమ - మోహం మాయ - ప్రధానం - ప్రకృతి - అజ్ఞానశక్తి - అవ్యక్తం- గుణసామ్యం అనే పిలువడే భ్రాంతి వల్ల జగదాభాస కలుగుతుంది. జగన్నిత్యత్వ భ్రాంతి ఏర్పడుతుంది. జీవేశ్వర విభాగానికి కూడా ఇదే కారణం. పరమాత్మ సదానంద లక్షణుడు (స్వరూపుడు) పురుషుడు అవృతానందుడు. కనుక ఈ జగద్దర్శనం. బ్రహ్మతత్వం నుండి అవ్యక్తం - అవ్యక్తం నుండి మహత్తు - మహత్తు నుండి అహంకారం, అహంకారం నుండి భూతసూక్ష్మాలైన పంచతన్మాత్రలూ వాటి నుండి స్థూలపంచభూతాలూ ఆవిర్భవించాయి. ఆ తర్వాత ఇంద్రియాలు, తదధిష్టాన దేవతలూ మనస్సూ జనించాయి. సృష్టి అంతా జరిగింది. రాజా! ఇది మనోమూలమూ భ్రాంతి కల్పితమూ కనుక. ఈ సృష్టికి ఈ జగదావిర్భావానికి ఇదే వరుస అనే నియమం లేదు. అందువలన కొందరు ఆకాశం నుండి సృష్టి జరిగింది అంటున్నారు.


No comments:

Post a Comment