గోదావరీతీరంలో కుశావర్తం అనే వూరు వుంది. అది ఒక బ్రాహ్మణ అగ్రహారం, అక్కడి వారంతా వేదవేదాంగవేత్తలూ సకల శాస్త్రపారంగతులూనూ. వారి మధ్యలో పాపం ఒక నష్టజాతకుడు వున్నాడు. అతడి పేరే పీడాతురుడు. పుట్టడమే వాతగుల్మరోగంతో ఎనిమిదో ఏట క్షయరోగం ఆ పైన మూడేళ్ళకి జలోదరం మరో ఏడాదికి జీర్ణజ్వరం. వీటికి తోడు ఆరు నెలలకి అతిసారం నాలుగునెలలకి భగంధరం ఇలా నానారోగాలు అతడ్ని పట్టి పీడిస్తున్నాయి. చివరికి త్రిదోషం సంక్రమించి ఇవ్వాళో, రేపో అన్నట్లు వుంది అతని పరిస్థితి. ఇంతచేసి అతనికి ఇరవై ఏళ్లు. అతనికొక భార్య. పాపం ఆ పిల్లవయస్సు పదహారు సంవత్సరాలు. పేరు సుమేధ. పేద యింటి పిల్ల. అభం శుభం తెలియని పిల్ల. ఏడవడం తప్ప ఏమీ తెలీదు. ఆ రోగిష్టి వాడికి సకలోపచారాలు చేస్తుంది. విసుక్కోకుండా కనుక్కోకుండా శ్రద్ధగా సేవలు చేస్తోంది. ఎవరు ఏమందుచెబితే అదల్లాకొని తెచ్చి వేస్తూ వుండేది. ప్రతీ వైద్యుడికీ చూపిస్తోంది. డబ్బుకు ముందు వెనుకా చూడడం లేదు. అత్తమామలు హరియంటూ ఇచ్చి పోయిన ఆస్తి అంతా ఈ వైద్యాలకే హరించుకుపోయింది. దిక్కు తోచని పరిస్థితి. రోజు గడవని స్థితి. వూరివాళ్ళు చెయ్యగలిగినంత కాలం సహాయం చేసారు. ఇక వీడి రోగాలు తగ్గేవికావు. వీళ్ళ సంసారం బాగుపడేది లేదు అని వదిలేసారు. సరిగ్గా ఈ దశలోనే విష్ణుదత్తుడి అద్భుత మహిమ గురించి వింది ఆ లేత ఇల్లాలు. కన్న తండ్రిని తోడుతీసుకొని విష్ణు దత్తుని ఇంటికెళ్ళి వలవలా ఏడుస్తూ తన దుస్థితి అంతా చెప్పుకొని పతిభిక్ష పెట్టమని ప్రార్ధించింది. విష్ణుదత్తుడు ఓదార్పు మాటలతో ధైర్యం చెప్పాడు. తన నిత్యాగ్నిహోత్రాన్ని శిష్యునికి అప్పగించి వారి వెంట కాలినడకన కుశావర్తానికి చేరుకొని పీడాతురుణ్ని చూసాడు. ప్రాణాలు ఉగ్గబట్టి మూసిన కన్ను తెరవకుండా పడివున్నాడు. వెంటనే విష్ణుదత్తుడు ఆ వూరి వాళ్ళందర్నీ సమావేశపరిచి మీ బంధువు ఈ పీడాతురుని పరిస్థితి ఇలా వుంది. ఇప్పుడు ఏమి చెయ్యాలో దయజేసి ఆలోచించండి. అందరూ ఏమైనా చెప్పవలసింది ఉంటే నాకు తెలియజేయ్యండి అని సవినయంగా విజ్ఞప్తి చేసాడు.
విప్రోత్తమా! అన్నింటికీ నీవే ప్రమాణం. నీవు ఏది చెబితే అది. ఏది చేస్తే అది. మేమంతా ఇంతకాలమూ మా శక్తి మేరకు ఏవేవో యత్నాలు చేసాం. ఏదీ ఫలించలేదు. ఇప్పుడు నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాం అని బ్రాహ్మణులంతా ఏక కంఠంతో పలికారు. విప్రులారా ! మీరు భారమంతా నా మీద పెడుతున్నారు. నా మనసులోని మాట చెబుతున్నాను వినండి.
No comments:
Post a Comment