Sunday 28 May 2023

శ్రీదత్త పురాణము (152)

 


నిత్యా నిత్య వస్తు వివేకం ఫలభోగ విరక్తి శమదమాదిపట్క సంపత్తి ముముక్షుత్వం అనే సాధన చతుష్టయాన్ని సమకూర్చుకొని సద్గురువును ఆశ్రయించాలి. శ్రవణ మనన నిదిధ్యాసధారణాదుల్ని అవలంభించాలి. దయాళుడైన సద్గురువు తత్వమ్ అని వంటి తత్వ నిశ్చయకాలైన మహావాక్యాల్ని ఉపదేశిస్తాడు. వాటి అర్ధాన్ని షడ్విధలింగాలతో మనస్సులో చర్చించుకుని అవధారణ చెయ్యాలి. దీన్నే శ్రవణం అంటారు. "శ్రవణమ్ తదితి ప్రోక్త మవధారణ లక్షణమ్”. ఈ మహావాక్యాన్ని క్లుప్తంగా వివరిస్తాను విను.


తత్పదంతో పరబ్రహ్మనూ త్వమ్పదంతో పురుషుణ్ని (జీవుణ్ని) చెప్పి అసిపదంతో ఈ రెండింటి ఐక్యాన్ని బోధిస్తుంది. ఈ మహావాక్యం. తత్ అనేది పరోక్షం. త్వమ్ అనేది సన్నిహితం. “త్వమ్”ను ఉద్దేశించే తత్పదాన్ని చెప్పింది వేదం. త్వమ్పదార్ధమైన జీవుడు సంసారి. తత్పదార్ధమైన పరబ్రహ్మం సంసార విరహితం. మరి ఇవి రెండూ ఏకమవ్వడం ఎలాగ? చెబుతున్నాను విను.


దేవదత్తుడు అనే వాణ్ని ఎప్పుడో ఎక్కడో చూసావు. కొన్ని సంవత్సరాలు గడిచాక ముసలివాడైన దేవదత్తుణ్ని మరోచోట ఎక్కడో మళ్ళీ చూసావు. ప్రదేశమూ అవస్థా యౌవనమూ, ముసలితనమూ వగైరాలన్నింటినీ విడిచిపెట్టి ఆ దేవదత్తుడు ఇతడే అని గుర్తిస్తున్నావా లేదా? అలాగే ఇక్కడ తత్ త్వమ్ పదార్థాలను గుర్తించాలి.


త్వమ్ పదానికి సంసారి అనివాచార్ధం నిశ్చయమైంది. మాయావృతుడైన ఆ సంసారి కర్త- భోక్త సుఖి దుఃఖి అని చెప్పబడుతున్నాడు. నిజమాలోచిస్తే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమే సంసారి ఇది వాచ్యార్థం. ఇంక తత్పదానికి వాచ్యార్ధం సర్వజ్ఞుడైన శివుడు. అంటే మాయావృతమైన పరబ్రహ్మం సృష్ట్యాదికార్యాలు చేస్తూ ఈశ్వరుడయ్యాడు. కనుక ఒక అంశం చిద్రూప పరబ్రహ్మం. ఇది లక్ష్యార్థం. రెండవ అంశం సర్వజ్ఞ పరమేశ్వరుడు. ఇది వాచ్యార్ధం. ఇప్పుడు రెండింటిలోనూ రెండవ అంశాలుగానున్న వాచ్యార్ధాలను తొలగిస్తే రెండింటా మిగిలేది లక్ష్యార్ధమైన ఒక్క పరబ్రహ్మమే.


No comments:

Post a Comment