ఇలా అల్పుడైన జీవుడూ, సర్వజ్ఞుడైన ఈశ్వరుడూ ఏకమవుతున్నారు. అంచేత తత్ =అది, త్వమ్ = నువ్వు, అసి= అయ్యున్నావు అనే మహావాక్యం కుదరుతోంది. కాబట్టి బ్రహ్మమే నువ్వు, నువ్వే బ్రహ్మము, ఇద్దరికీ భేదం లేదు. అంటే దుఃఖిత్వాన్ని పరిత్యజించి త్వమ్ పదార్థమే తత్పదార్ధమవుతుంది. నువ్వే బ్రహ్మస్వరూపుడవు అవుతావు. ఈ తత్-త్వమ్ పదార్థాలు పరస్పరం విశేషణ విశేష్యభావం పొందుతున్నాయి.
దుఃఖిత్వాన్ని పరిత్యజించి నువ్వే బ్రహ్మరూపుడవు అనే వాక్యం పరోక్ష జ్ఞానబోధకం. బ్రహ్మమే నువ్వు అనే వాక్యం అపరోక్ష (ప్రత్యక్ష) జ్ఞానబోధకం. ఈ మహావాక్యానికి ఇలా ఒక అంశాన్ని విడిచిపెట్టి మరొక అంశాన్ని విడిచిపెట్టకుండా సమన్వయించటాన్ని జహద జహల్లక్షణ అంటారు. వేదంలో జ్ఞానకాండ అనుసరించిన పద్ధతి ఇది. తక్కిన ఉపాసనకాండ, కర్మకాండల తాత్పర్యం కూడా ఇదేనని తద్ జ్ఞుల నిర్ణయం. ఇది స్థూలమంతులకు దురజ్ఞేయం. సూక్ష్మబుద్ధులకు సుఖీయం. స్మృతిశాస్త్ర పురాణాలన్నీ ఈ మహార్ధాన్ని ఇలాగే చెప్పాయి. దీన్ని గ్రహింపలేని కొందరు మూఢులు పండితమ్మన్యులై వేదాన్ని ప్రవృత్తిపరం అంటున్నారు. ఇది అసమంజసం. వేదతాత్పర్య నిర్ణయానికి షడ్విధలింగాలు ఉన్నాయి. వాటిని చెబుతాను. తెలుసుకో.
శాస్త్రంలో ప్రకరణాన్ని ఏ విషయంలో అరంభిస్తారో దానితోనే ముగిస్తారు. ఇది ఒక లింగం ఉపక్రమోప సంహారములంటారు. ఆగమాల్లో ఒకే విషయాన్ని పౌనఃపున్యంగా చెబుతుంటారు. దాన్ని అభ్యాసమంటారు. ఈ అంకాన్ని ఈ శాస్త్రంతోనే తెలుసుకోవాలి. ప్రమాణాంతరం లేదు అన్నట్లయితే అది అపూర్వత, అజ్ఞానాంధకారం తొలగిపోవడమనే ప్రయోజనమే ఫలం. ఇది నాల్గవలింగం. చెప్పిన దాన్ని దృఢపరచటం కోసం బహువిధాల ప్రశంసించటం అర్ధవాదం. శాస్త్రార్థవినిశ్చయంలోని తర్కాన్ని ఉపపత్తి అంటారు. ఇలా తాత్పర్య నిర్ణయానికి ఆరు లింగాలు (ప్రమాణాలు) ఉన్నాయి.
గురువు దగ్గర విన్నదాన్ని వివిధోపాయాలతో యుక్తులతో బాగా పరిచింతనం చెయ్యాలి. దీన్నే మననము అంటారు. శ్రుతానికి మననం లేకపోతే అది నిలవదు. జారిపోతుంది. మననము అనేది ఒక యోగాంగం. యోగసిద్ధిని కోరుకునే ముముక్షువులు ఈ యోగాంగాలను పాటించాలి. ఇవి ఎనిమిది అని కొందరూ ఆరు అని కొందరూ పరిగణిస్తున్నారు.
No comments:
Post a Comment