Monday, 22 May 2023

శ్రీదత్త పురాణము (146)

 


కార్తవీర్యార్జునా బృహస్పతి ప్రశ్నకు ఇంద్రుడు ఏమన్నాడంటే ముందుగా అభిమానం విడిచిపెట్టి సాష్టాంగ నమస్కారం చేసాడు. ఆపై ఇలా పలికాడు. గురూత్తమా శరణు శరణు. నా అజ్ఞానాన్ని క్షమించండి. తెలియక చులకనగా మాట్లాడాను. సంగీత, నృత్య, వైద్య, తంత్రాది, సకల శాస్త్రాలు ప్రధానంగానో లేదా పరంపరగానో మూల అవిద్యా నివారకాలనీ పరమాత్మ తత్వప్రకాశకాలనీ మోహకారకాలు కాదనీ స్పష్టంగా తెలిసింది. మీరు చెప్పిన ఏడు కధలూ ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. మీరు చెప్పిన పుణ్యప్రదమైన ఈ ఇతిహాసాల్ని సమాహిత చిత్తంతో అవగాహన చేసుకున్నవారు అవిద్య కారణంగా జన్మించే మోహాన్ని విదిల్చుకొని కర్మ బంధం నుండి విముక్తులు కాగలుగుతారు - అని గురువైన బృహస్పతికి మరోసారి సాష్టాంగ నమస్కారం చేసి శచీ వల్లభుడు (ఇంద్రుడు) సెలవు తీసికొన్నాడు.


దత్తస్వామి ఇంత వరకూ చెప్పి- కార్త వీర్యార్జునా నీ సందేహాలన్నీ తొలగిపోయాయి గదా! శాస్త్రాలకు గల వైరుధ్యము అనేది పైపై చూపులకు కనిపించే అభాసమే తప్ప ఆత్మ దృష్టిలో అన్ని శాస్త్రాలు పరతత్వ ప్రతిపాదకములే. అందుచేత వృధా వాదోపవాదాలతో అహంకరించి కాలయాపన చెయ్యడం కన్నా ఏదో ఒక శాస్త్రాన్ని - ఒక దారినీ పట్టుకుని దాన్నే - నమ్ముకుని ముందుకు సాగితే అవిద్య అంతరిస్తుంది. తత్వజ్ఞానం కలుగుతుంది. గ్రహించావా? అన్నారు.


దేవదేవా - జగన్నాధా- సర్వ సందేహభేధకా నా సందేహాలన్నీ తొలగిపోయాయి. శాస్త్ర ప్రతిపాదిత విషయాలలో వైరుద్ధ్యం అనేది ఇపుడు అసలు ఎక్కడా కన్పించడంలేదు. వైరుద్ధ్యంవుందని కూడా అనిపించడం లేదు. అవి క్షుద్ర శాస్త్రాలైనా సరే శుద్ధ శాస్త్రాలైనా సరే అన్నీ ఒకే అర్ధాన్ని ఒకే పరమార్థాన్ని ఒకే పరమాత్మతత్వాన్ని భోదిస్తున్నాయి. దత్తయోగీంద్రా నీ ప్రభావం వల్ల ఇపుడు నా మనస్సు ఆత్మ బోధనలో వెంటనే సులువుగా ప్రవేశించాలని తహతహలాడుతోంది. నీ సహాయం అడుగుతున్నాను. బ్రహ్మనిష్టున్నీ-అఖిలాతీతుడ్ని-లౌకిక వ్యవహారముల నుండి విముక్తుడ్ని అయి ఈ శరీరం వున్నంతకాలం సుఖంగా కాలంగడిపే విధానం ఏమిటో దాన్ని నాకు బోధించి - శాసించి నేర్పు" అని కార్తవీర్యార్జునుడు మరో మారు దత్తయోగి పాదాలపై బడ్డాడు.


No comments:

Post a Comment