బంధమోక్షాలు రెండింటికీ మనస్సే కారణం. అది విషయాసంగి అయితే బంధహేతువు. అదే నిర్విషయమైతే ముక్తి హేతువు, పరపురుషుడ్ని మరిగిన వనిత ఇంటి పనుల్లో తలవుంచి ఉన్నప్పుడు కూడా అంతరంగంలో అలనాటి సంగము రసానుభూతిని నెమరువేస్తూ జీవిస్తుందో అలాగే ధీరుడైన జ్ఞాని బహిర్ వ్యవహారాలను నిర్వహిస్తూ కూడా అంతరంగంలో శుద్ధ పరతత్వాను భూతిని పొందుతూ వుంటాడు.
బాలయోగీ! మోక్షమనేది ఎక్కడో ఆకాశం మీదనో పాతాళంలోనో భూగోళం మీదనో లేదు. మన లోనే వుంది. అహంకార రూపమైన విమోహం నశించడమే మోక్షం అంటే. ఇదేమంత కష్టంకాదు. పువ్వులు కోయడం కన్నా కన్నులు మూసుకోవడం కన్నా అహంకార పరిత్యాగం తేలిక అయిన పని. ఇందులో ఏ కొంచెం కష్టం కూడా లేదు. ఎందుకంటే ఇది మనస్సు పని కనుక. ఈ మనస్సుకు వున్న చాంచల్యం అన్నింటికీ మూలం. ఇదే ప్రపంచాకారంగా (పెద్దదిగా) అనిపిస్తుంది. విషయసుఖాల వెంట పరుగులు తీస్తుంది. వాటిని తెగ మెచ్చుకుంటుంది. అవసరమైన ద్రవ్యాదులను యాచిస్తుంది. ఆనిశ్చయంతో భ్రాంతిగా వుంటుంది. తానే మూఢంగా తయారవుతుంది. తాను కల్పించుకున్న ప్రపంచంలో తానే మునిగిపోతుంది. అపరత్వాన్ని పొందుతుంది. ఇవన్నీ దానికి స్వభావమైన చంచలశక్తి వల్ల సంభవిస్తున్న చాంచల్యాలు. కాబట్టి బుద్ధిమంతుడా, ఈ మనస్సు తత్వాన్ని గుర్తిస్తే అహంకార పరిత్యాగం ఏ మంతకష్టం కాదు. అందచేత నీవు కూడా ఈ జడత్వాన్ని విడిచిపెట్టు నిరహంకారంగా, నిర్మమంగా కర్మాచరణం చెయ్యి నువ్వు నాకు ఇష్టుడవయ్యావు. తల్లితండ్రుల్ని సంతోషపరచాలి అనే సంగతి ఆలోచించు. కొంతకాలం వాళ్ళకి ప్రీతికరంగా జీవించు. వాళ్ళు వెళ్ళిపోయాక నీ యిష్టం. అప్పుడు యధేచ్ఛగా సంచరించవచ్చు. అప్పుడు నిన్నెవరూ నిర్బంధింపరు.
విష్ణుదత్తుని ఉపదేశాన్ని శిశుయోగి అంగీకరించాడు. ఆ క్షణం మండే విత్యనై మిత్తిక కర్మలు ఆచరించడం మొదలు పెట్టాడు. స్నానసంధ్యలు ముగించివచ్చాడు. పతివ్రతా శిరోమణి సుశీలమ్మ వడ్డించిన రుచికరమైన ఆహారాన్ని మెచ్చుకుంటూ మితంగా ఆరగించాడు. దానితో అతడిలో దాగిన భయాలు అన్నీ అంతరించాయి. నిస్సంగంగా వుండవచ్చనీ వుండగలననీ ధైర్యం తెచ్చుకున్నాడు. భోజనం ముగించివచ్చిన తల్లితండ్రులు తమ బిడ్డలో వచ్చిన మార్పుని చూసి బ్రహ్మానందపడ్డారు. సుశీలా విష్ణుదత్తులకు కృతజ్ఞతగా సాగిలపడి మ్రొక్కారు.
ఏం మంత్రం వేశావో ఏం వైద్యం చేసావో కృపానిధీ క్షణంలో మా వాడికి కొత్త జీవితం ప్రసాదించావు. నీ మేలు జన్మ జన్మలకీ మరచిపోనంటూ బిడ్డను తీసికొని ఆదంపతులు సంతోషంగా వెళ్ళిపోయారు.
No comments:
Post a Comment