Tuesday, 16 May 2023

శ్రీదత్త పురాణము (140)

 


ఇదే చివరి పరీక్ష నీ శక్తికి యుక్తికీ ఇందులో నెగ్గడమే నెగ్గడం అంటూ సన్న మూతివున్న సీసాలాంటి గాజు పాత్రను దాని మూతతీసి అందరి సమక్షంలో మధ్యలో వుంచాడు. ఇందులోకి తటాలున ప్రవేశించి చటాలున బయటకు రావాలి. ఇదే చివరి పరీక్ష ప్రయత్నించండి అన్నాడు. విష్ణుదత్తుని మాట ముగిసేలోగానే "గా" వ్యక్తి సూక్ష్మరూపం ధరించి గాజు సీసాలోకి ప్రవేశించాడు. విష్ణుదత్తుడు అప్పుడు మెరుపు వేగంతో బిరడాతో సీసా బిగించాడు. పిశాచం ఇంక బయటకు రాకుండా మంత్రం వేసాడు. సాక్షులూ, ప్రేక్షకులూ అందరూ హర్ష ధ్వానాలు చేసారు. ఇన్నేళ్ళుగా పట్టిపీడిస్తున్న పిశాచం పీడ విరగడ అయ్యిందని అందరూ హాయిగా వూపిరి పీల్చుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. సత్య కుండీలుడూ విశాలాక్షీ పరస్పరం గాఢంగా కౌగలించుకున్నారు. విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారములు చేసి ఆశీస్సులు తీసికొన్నారు.


అక్కడున్న వారిలో ఒక వ్యక్తిలేచి మహానుభావా నువ్వు దివ్యశక్తి సంపన్నుడవని మాకు తెలుసు. కేవలం అలా చూసి పత్యాసత్యాలను గ్రహించగలవు. మరి నాలుగు పరీక్షలు పెట్టావేమిటి? దయచేసి నా సందేహం తీర్చు అని అభ్యర్థించాడు.


అప్పుడు విష్ణుదత్తుడు ఇలా చెప్పాడు. మాన్యులారా. నేను సత్యమైన వ్యక్తిని గుర్తించడం కాదు. మీరు కూడా గుర్తించేటట్లు చేయాలి. విశాలాక్షి గుర్తించాలి. విశ్వసించాలి. ఇవి జరగాలి అంటే పరీక్షలు తప్పదు. అందుకే నేను మూడు పరీక్షలు పెట్టాను. ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటువుంటుంది. ఉన్న వాటిలో కొన్నింటిని మరచిపోవచ్చు. కానీ లేని వాటిని మాత్రం చెప్పలేడు. దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు కనుక ఉన్నవీ లేనివీ చెప్తాడు. ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో దాన్ని పోలిస్తే అసలురంగు తెలుస్తుంది. ఈ పరీక్షలో మనం ఖచ్చితం అయిన నిర్ధారణ చెయ్యకపోయినా యజమాని ఆచూకీ తెలుసుకోవచ్చు.


No comments:

Post a Comment