Wednesday 17 May 2023

శ్రీదత్త పురాణము (141)

 


ఇక రెండవ పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపూ సొలుపూ లేకుండా తిరిగివచ్చిన వ్యక్తి దేవత అయినా దయ్యం అయినా అవ్వాలి తప్ప మానవుడు కాడు. కాబట్టి దీనితో దొంగ ఎవరో నిశ్చయం అయ్యింది. ఇంకా ఎవరికైనా ఏమైనా సంశయాలువుంటే వాటిని తొలగించడానికి మూడో పరీక్ష ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించిన విషయం కనుక అన్ని విధాలా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి. లేకపోతే భార్యాభర్తల్ని విడదీసిన పాపము, అక్రమ సంబంధాన్ని అంగీకరించిన పాపము చుట్టుకుంటాయి. అందువలన మూడో పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాం. సిద్ధయోగులు వారంతట వారు అనుగ్రహిస్తే తప్ప ఎవరికీ కనిపించరు. అలాంటిది - అందరిని చూసి వచ్చావని గోత్రనామాలు గబగబా చెప్పినవాడు. అలవాటుపడిన అసత్యవాది అన్నమాట. మాయలూ మోసాలు చెయ్యగల ఘటికుడన్నమాట. పిశాచం ఎవడో ఇప్పుడు నిశ్చయంగా తెలిసింది కదా! దీన్ని బహిరంగంగా చెప్తే వాడు పారిపోవచ్చు లేదా తిరగబడవచ్చు లేదా ఇంకేదైనా చేయవచ్చు. నేనే గెలుస్తున్నాను అనే భ్రమలో వాడు వున్నాడు కనుక అదే వూపులో వాడిని బంధించాలి. నిజానికి బంధనమే నాలుగో పరీక్ష మనం పెట్టినవి మూడు పరీక్షలే.


ఒక అజ్ఞానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమంగా అజ్ఞానం తొలగించి, వికాసం కలిగించి, ఆవిద్యను సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతడిలో ప్రకాశింపజేసినట్లుగా మొత్తం ఈ ప్రక్రియ అంతా నడిపించాను. ఇది నీతిజ్ఞులు చెప్పిన మార్గం. దీన్ని అనుసరించి మీ అనుమానాలు తొలగించి తుది నిర్ణయం మీకే తెలిసేటట్లు చేసాను అన్నాడు.


అందరూ సంబరపడ్డారు. విష్ణుదత్తుడుకి యధోచితంగా నమస్కరించి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసికొన్నారు. అమరేంద్రా విష్ణు దత్తుడు చేసిన మరొక నిర్ణయం చెబుతాను. ఇది ఏడవ ఉదాహరణ. శ్రద్ధగా ఆలకించు. నీ సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి- అంటూ బృహస్పతి ఇంకా ఇలా చెప్తున్నాడు.


No comments:

Post a Comment