Wednesday 24 May 2023

శ్రీదత్త పురాణము (148)

 


యోగసిద్ధి రకరకాలుగా వుంటుంది. పరిచిత్తజ్ఞత - మనోజవం - ఆకాశగమనం - ఇలా చాలా రకాల సిద్ధులు వున్నాయి. కానీ ఇవన్నీ నశ్వరాలు, శాశ్వత సిద్ధులు కావు, సత్యమూ, నిత్యమూ అవిక్రియమూ అయిన సిద్ధిని నీకు అనుగ్రహిస్తున్నాను. అనుభవంలోకి తెస్తున్నాను. అక్షయమూ, అన్యయమూ అయిన ఉత్తమోత్తమ తత్వాన్ని నా నిజ స్వరూపాన్ని నీకు బోధిస్తున్నాను. దీనితో నీవు ముక్తిని పొందుతావు. నాయనా నిజానికి బద్ధుడు, ముక్తుడూ అనే పదాలు నిరర్ధకాలు. రెండు ఎక్కడున్నాయి. ఉన్నదల్లా ఒక్కటే వస్తువు. దాన్ని చెబుతాను తెలుసుకో. ఆ ఏకైక వస్తువు నామరూపదేశకాల వివర్జితం. నిర్విశేషం. అసామాన్యం. అనిర్వాచ్యం. అకారణం. అలక్ష్యం. లక్షణాతీతం. అచింత్యం. అనికేతనం. దీనికి నామ రూపాది కల్పనచేసి ఒక అజ్ఞానంతో (భ్రమతో) శాస్త్రం తయారు చేసి ఆయావ్యక్తుల ఆత్మ లబ్ధికోసం ఆయా వ్యక్తులు బోధిస్తుంటారు. ఇందంతా కేవలం భ్రమ, మోహం, అజ్ఞానమే తప్ప అసలు వస్తువు (బ్రహ్మతత్వం) కి నామ రూపాలు లేవు. కానీ వాటిని కల్పించకపోతే ఉపదేశించడం సాధ్యం కాదు. ఉపదేశం లేకపోతే జ్ఞాన సిద్ధిలేదు. అజ్ఞానమే అవిద్య. అదే భ్రమ. అదే మోహం. దీనికే రూపంలేదు. అనాది అని దీన్ని బుధులు పలకడం బాల బుద్ధి విశుద్ధి కోసమే. నిజానికి 1. జీవుడు 2. బ్రహ్మ 3. విశుద్ధ చిత్తు 4. జీవేశభేదం 5. అవిద్య 6. ఆవిద్యా- చిత్సం యోగం అనేవి ఆరూ అనాదులు.


జగజ్జీవేశ్వర కల్పన అంతా అజ్ఞాన కల్పితమే. అవిద్యే అన్నది లేనప్పుడు ఇక జీవేశ్వర భేదం ఎక్కడుంది? బేధమే లేనప్పుడు ఇంక పరమాత్మకు దేనితో యోగం? అయితే నామ రూప కల్పన లేకుండా నిర్గుణ పరబ్రహ్మము తెలియజెప్పడం అసంభవం కనుక ఆ సౌకర్యం కోసం చేసిన కల్పన ఇదంతా. నిజానికి బ్రహ్మతత్వం అనేది సత్యం. ఈ తత్వానికే ఆత్మేశ్వరుడు, పరమాత్ముడూ, వేద్యుడూ, విష్ణువు, పదాశివుడు, చతుర్ముఖుడు, శివుడూ, అగ్ని, ఇంద్రుడు, పరముడూ, స్వరాట్టు, విరాట్టు, అక్షరుడు, ప్రాణము, ఈశానుడు, సవిత విభువు, నారాయణుడు, హృషీకేశుడు, దేవుడు, పశుపతి, మహత్తు, మహాభూతం, మహాద్యక్షుడూ, సోముడూ, భగవంతుడు, మనువు, శంభుడు, శర్వుడు, కవి, దక్షుడు, ప్రజాపతి, ప్రభువు, హరి, దాత, విధాత, గురువు, గమ్యుడు, త్రిపాత్తు, యముడు, కాలం, ఆగమకర్త, ఈడ్యుడు, జీవనం, మృత్యువు, ఆమయం, యజ్ఞం, ఇజ్య, యజుస్సు, ధర్మం, నిధానం, బీజం, అవ్యయం - ఇలా ఎన్ని నామ రూపాలని చెప్పను? మహామతీ ఈ జగత్రయంలో కనబడేదీ, వినబడేది, ఆలోచింపబడేది, జన్మించేదీ, అంతా వస్తు మాత్రమేనని (పరబ్రహ్మమేనని) తెలుసుకో. అర్జునా, యోగనిష్టలో కూర్చుని ఎవరిని ధ్యానిస్తుంటావు నువ్వు సమస్తమూ నీవే కదా? అని నన్ను అడిగావు గుర్తున్నదా? 

No comments:

Post a Comment