Monday, 8 May 2023

శ్రీదత్త పురాణము (132)

 


బ్రాహ్మణోత్తమా! విష్ణు దత్తా! నీకు పూర్తిగా ప్రసన్నున్ని అయ్యాను. వరం కోరుకో. నా భక్తుడవైన నీ వాంఛితం తీరుస్తాను. దివ్యమైన నా అష్టోత్తర శతనామావళిని నీవు ఈ విధంగా ప్రకాశింపజేసావు, సులభసుందరశైలిలో అందరికీ విన్నంతనే అర్ధం అయ్యే భాషలో నా తత్వాన్ని నా రహస్యాన్ని ఆవిష్కరించావు. అతి పురాతనమైన ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించిన వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగసిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు. నిజంగా పతియే దైవముగా కలది. ఈమె ప్రభావం ఎంతటిదో ఈనాడు ప్రత్యక్షంగా చూశాను. ఈమె సమస్త కళ్యాణగుణ సంపన్న. నువ్వు సర్వవిద్యానిధివి. మీ దంపతులు ఇద్దరూ ఒకరికొకరు తగినవారు. సమానశీలురు. నాకు అత్యంతమూ ఆనందదాయకులు.


దంపతులారా ! నా అనుగ్రహంవల్ల మీరు జీవితాంతమూ సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగవిద్యాతత్పరులై పరమానందాన్ని పొందండి. చివరికి పరమానంద స్వరూపమైన నాతో లీనమవ్వండి. ద్విజవర్యా! నీకొక మంత్రాన్ని - ఉపదేశిస్తాను. స్వీకరించు. దీనివల్ల నువ్వు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తే వారికల్లా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ధనధాన్య యశఃశ్రీ సమృద్దులూ పుత్రపాత్రాభివృద్ధి, వంశాభివృద్ధి ఒకటేమిటి వారు కోరుకున్నవన్నీ క్షణంలో సిద్ధిస్తాయి. ఇందులో సందేహం లేదు.


నువ్వు ఈరోజు నిర్వహించిన శ్రాద్ధవిధివల్ల నీ పితృదేవతలందరూ కర్మపాశ విముక్తులై శాశ్వతమైన బ్రహ్మలోక నివాసం పొందారు. అత్యంత దుర్లభమైన ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను.


నీ యింటి ముంగిట రావిచెట్టు మీద ఉంటున్న రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేసాడు. నేటి శ్రాద్ధవిధిలో ఉచ్ఛిష్టపాత్రాన్నాన్ని తిని అతడు ముక్తుడవుతాడు. స్వర్గలోకం చేరుకుంటాడు. ఇలా పలికి దేవదేవుడు ఆ విష్ణుదత్తుని చెవిలో దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. అతడు దాన్ని తన భార్యకు ఉపదేశించాడు. ఇద్దరూ ఏకాగ్రచిత్తంతో జపించారు. దత్తదేవుడు తన అమృత హస్తాన్ని వారి శిరస్సుల పై వుంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమైనాడు.  

సూర్యభగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడై ఆదంపతులకు దివ్య స్థితిని అనుగ్రహించాడు. కామాగమనం కలిగిన దివ్య విమానాన్ని బహుకరించాడు. తలుచుకున్న వెంటనే దర్శనం ఇస్తానని వరమూ అనుగ్రహమూ ఇచ్చాడు. దంపతులిద్దరూ సాష్టాంగపడ్డారు. కర్మసాక్షి వినువీధికి చేరుకున్నాడు. ఇలవేల్పు అగ్నిదేవుడు కూడా దంపతులకు వరాలు అనుగ్రహించాడు. అమ్మా! నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతాను. నువ్వు ఏదికోరితే అది నెరవేరుస్తాను. విష్ణుదత్తా నువ్వు నన్ను నిత్యమూ యధావిధిగా ఆరాధిస్తున్నావు కనుక నీరు కర్మ సిద్ధిని అనుగ్రహిస్తున్నాను. నువ్వు మహాతేజస్విని- అనుల్లంఘశాసకుడవీ- నిత్య సుఖినీ- పర్వదేవా సుఖ ప్రదుడవు అగుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యాగ కుండంలోకి ప్రవేశించాడు. రాక్షసుడు వచ్చి ఉచ్చిష్టాన్ని భక్తితో భుజించి రాక్షసరూపాన్ని విడిచిపెట్టి దివ్య సుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానం ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు.


No comments:

Post a Comment