ఆ రాత్రి మాయా కుండిలుడు విశాలాక్షిని తనివితీరా అనుభవించాడు. ఆవిడ తట్టుకోలేక పోయింది వీడి బలం, భోగసామర్ధ్యం. అతికామం ఇంకా వివిధ లక్షణాలు వికారాలు విశాలాక్షికి అనుమానం కలిగించాయి. తన భర్తకాదు అని మనసుకి తెలుస్తోంది. కానీ రూపం చూస్తే ముమ్మూర్తులా అదే. ఎవరికి చెబితే ఎవరు నమ్ముతారు. తనలో తనే కుమిలిపోతూవుంది. వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తున్నాడు. ఏ పని మీద బయటకు కూడా వెళ్ళడం లేదు. విశాలాక్షిని వెళ్ళనివ్వడం లేదు. విశాలాక్షి అన్ని విధాలా నలిగిపోతూవుంది. రోజురోజుకీ ఆమె శరీరం కృంగి కృశించిపోతూవుంది. నెల అయ్యేసరికి ఎండు కట్టెలా తయారయ్యింది.
అదే రోజు సాయంకాలానికి కుండిలుడు తిరిగి వచ్చాడు. చిక్కిశల్యమై గుమ్మంలో నిలబడ్డ విశాలాక్షిని గుర్తుపట్టలేకపోయాడు. విశాలాక్షి మాత్రం భర్తను గుర్తు పట్టింది. ఆమెకు ఒక్క పెట్టున దుఃఖం పొంగుకొచ్చింది. గుమ్మంలోనే కుప్ప కూలింది. కుండీలుడు త్వరత్వరగా సమీపించాడు అయ్యో అయ్యో అంటూ ఆవిడ్ని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఏమి చెయ్యాలో పాలు పోవడం లేదు. అర్ఘ్యపాద్యాదులతో ఎదురువస్తుంది, స్వాగతం పలుకుతుంది అనుకున్న భార్య ఒక్క నెలలో ఇంతగా కృశించి చిక్కి శల్యమై నన్ను చూస్తూనే కుప్ప కూలిపోవడమేమిటి? కాసిన్ని మంచి నీళ్ళు తెచ్చిచల్లుదాం తేరుకుంటుంది అని లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఇంటిలో నుండి మాయా కుండీలుడు బయటకు వచ్చాడు. నువ్వెవరంటే నువ్వెవరు? నువ్వు మాయగాడివి అంటే నువ్వు మాయగాడివి నువ్వు మోసగాడివి అంటే నువ్వు మోసగాడివి అనుకున్నారు. ఇద్దరూ పరస్పరం వాగ్వివాదంతో అరుచుకుంటున్నారు. ఇరుగుపారుగు జనం పోగయ్యారు. ఎవరు నిజమైన కుండీలుడో గుర్తుపట్టలేకపోయారు. ఇంతలో విశాలాక్షికి స్పృహవచ్చింది. తలపట్టుకొని కూర్చుని ఏడుస్తుందే తప్ప తనూ గుర్తుపట్టలేకపోయింది. ఇద్దరూ ఒకే చోట ఉండే సరికి ఎవరు సత్యకుండీలుడో ఎవరు మాయా కుండీలుడో గుర్తు పట్టలేకపోయింది. తన సోదరులు తల్లితండ్రులూ ఇంకా బంధు వర్గమూ అందరినీ చుట్టు ప్రక్కల గ్రామాల నుండి రప్పించింది. అందరూ వచ్చిరి. ఏ ఒక్కరూ ఎవరు సత్యమైన కుండీలుడో పోల్చ లేకపోయారు. తేల్చలేకపోయారు.
ఇంతలో గుంపునుండి ఎవరో అన్నారు. ఇలాంటి ధర్మ సంకటాల్లో విష్ణుదత్తుణ్ణి శరణు వేడడమే తక్షణ కర్తవ్యం అనీ, ఆయనగారైతే క్షణంలో తేలుస్తారు ఈ జటిల సమస్యని అని అందరూ అవునంటే అవును అనుకున్నారు. సత్యకుండీలుడు, మాయా కుండిలుడు కూడా ఒప్పుకున్నారు. పదండి అంటే పదండి అని అందరూ త్వరత్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడి ఇంటికి చేరుకున్నారు. నమస్కరించారు. సమస్య ఏమిటో ఆయనకు వివరించారు. విశాలాక్షి మాత్రం భోరుభోరున విలపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడింది. విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇద్దరు కుండిలుల వైపుకి చూసాడు నిశితంగా. ఎవరు మాయగాడో తెలిసిపోయింది. అయితే దాన్ని జనం నమ్మేటట్లు ఆధారాలుతో నిరూపించాలి. నిర్ధారించాలి. మహిమచూపించి నిరూపిస్తే పిశాచ మాయకూ దీనికి జనం దృష్టిలో తేడావుండదు. కాబట్టి మానుషమైన ఉపాయంతోనే ఈ చిక్కు సమస్యను విడదీయాలి. ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు.
No comments:
Post a Comment