Saturday, 13 May 2023

శ్రీదత్త పురాణము (137)

 


కుండిలుడు - విశాలాక్షి గాధ


ఇంద్రా ఇంక ఆరవ ఉదాహరణ కూడా ఆలకించు. సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉంది. ఆ వూళ్ళో కుండిలుడు అనే బ్రాహ్మణుడు వున్నాడు. అతని భార్య విశాలాక్షి. అప్సరసలను తలపించే సౌందర్యం. రూపానికి తగిన గుణాలు. సౌశీల్యానికి, అణుకువకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండీ ఇరుగుపొరుగు వారితో అవును అనిపించుకుంటోంది. వివాహం అయ్యి ఐదేళ్ళు గడిచినా వారికి సంతానం లేదు. ఎన్నో నోములూ వ్రతాలు చేస్తున్నారు కానీ ఇంకా భగవంతుడు వారిని అనుగ్రహించలేదు. భార్యాభర్తలు ఇద్దరూ సుఖంగా ఆన్యోన్యంగా కాలం గడుపుతున్నారు. ఇలా వుండగా ఒకనాడు కుండిలుడు పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు. వెళ్ళడానికి అక్కడ వుండి పని చూసుకొని తిరిగి రావడానికి నెల్లాళ్ళు పడుతుందని అందాకా భార్యకు ఇంట్లో కావలసిన సరుకులు సిద్ధంచేసి ఇరుగుపొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారిబత్తెం మూటగట్టుకొని ఉదయాన్నే చల్ల బాటువేళ బయలుదేరాడు.


ఆ ప్రాంతంలో ఝంటిగుడు అనే మగ పిశాచం తిరుగుతుంది అనే ప్రతీతివుంది. వాడు పూర్వ జన్మలో బహు దుష్టుడు, దుర్భలుడు, దుర్జనుడు, కామాతురుడై అర్ధాంతరంగా చచ్చాడు. పిశాచమయ్యాడు. ఎంతటి మంత్ర గాళ్ళకి వీడు లొంగడం లేదు. అందగత్తె ఒంటరిగా కనబడితే చాలు మోసంచేసి గాని, బలాత్కారం చేసిగాని అనుభవిస్తున్నాడు. వాడు తనకున్న మాయాశక్తితో ఏ రూపం కావలిస్తే ఆ రూపం ధరిస్తున్నాడు. అందుచేత వీడు చేసే మోసాలు అంతా అయ్యాక గాని బయట పడటం లేదు. ఎందరెందరో గృహిణులు వీడు చేసిన మోసానికి లోపలే కుమిలిపోతున్నారు. కొందరి సంసారాలు అయితే కూలిపోయాయి కూడా. వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి వుంచాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలావేసి కూర్చున్నాడు. అవకాశం వచ్చింది. చంకలు కొట్టుకొన్నాడు. అచ్చం ముమ్మూర్తులారూపం మార్చుకొని కుండీలుడిలా తయారయ్యి సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి తలుపుతట్టాడు. విశాలాక్షి తలుపుతీసి ఆశ్చర్యపోయింది. కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు అందించి నెలపడుతుంది అన్నారు ప్రొద్దున్నే కదా వెళ్ళారు సాయం కాలానికే తిరిగి వచ్చారు ఇదేమిటి? అంది. తాను ఎవరిని కలుసుకోడానికి బయలుదేరాడో అతడే దారిలో ఎదురయ్యాడని ఇప్పుడు కాదు నీ పని అవ్వాలంటే ఒక నెల తరువాత రమ్మన్నాడని అందుచేత అప్పుడు బయలు దేరి వెడతానని ఇప్పుడు వెనక్కి వచ్చేసాను అనీ ఏదో కధ అల్లి చెప్పాడు మాయా కుండీలుడు. పాపం విశాలాక్షి నమ్మేసింది. అదృష్టం బాగుండి ఆయనెవరో దారిలో కలిసారు కనుక సరిపోయింది లేకపోతే రానూపోనూ శ్రమ మిగిలేది పోనీలెండి. మంచిపనే జరిగింది. స్నానానికి లేవండి రెండు మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందురుగాని ప్రొద్దుట నుండి నడిచినడిచి అలిసిపోయినట్లున్నారు అంటూ వంటింట్లోకి దారితీసింది.


No comments:

Post a Comment